Begin typing your search above and press return to search.

కమల్ హాసన్..డిపాజిట్లు అయినా దక్కేనా..?

By:  Tupaki Desk   |   19 April 2019 4:25 AM GMT
కమల్ హాసన్..డిపాజిట్లు అయినా దక్కేనా..?
X
పెద్దగా రాజకీయ కసరత్తు ఏదీ లేకుండానే తన పార్టీ తరఫున తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టారు నటుడు కమల్ హాసన్. కనీసం మూడు నాలుగు సంవత్సరాల కసరత్తు అయినా లేనిదే ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో ఉనికిని చాటుకోవడం కష్టం. ఆల్రెడీ రెండు బలమైన ప్రాంతీయ పక్షాలు ఉన్న చోట, ఇంకా బోలెడన్ని ప్రాంతీయ పార్టీలు కుల - ప్రాంతీయ వాదాలతో ఉనికిని చాటుకున్న చోట.. మరో పార్టీ తన ఉనికిని చాటాలంటే చాలానే కష్టపడాలి.

అలాంటి కష్టం లేకుండానే కమల్ హాసన్ తన పార్టీని పోటీలో ఉంచారు. తమిళనాట ఎన్ని రాజకీయ పార్టీలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ ఒక్కో వాదంతో ఒక్కో ప్రాంతీయ పార్టీ ఉంది. ఇక అధికారాన్ని చేతిలో పెట్టుకుని అన్నాడీఎంకే, ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశపెట్టుకుని డీఎంకేలు అమీతుమీ తలపడ్డాయి. ఈ ప్రాంతీయ పార్టీలకు చెరో వైపున చేరాయి బీజేపీ, కాంగ్రెస్. ఇంకా బోలెడన్ని ప్రాంతీయ పార్టీలు వీటితో కూటమిగా ఏర్పడ్డాయి.

అలాంటి పరిణామాల మధ్యన తన పార్టీ సోలోగా పోటీ చేస్తోందంటూ కమల్ రంగంలోకి దిగారు. అందులో తప్పేం లేదు కానీ, సోలోగా పోటీ చేయడానికి తగిన కసరత్తు సాగలేదని మాత్రం కచ్చితంగా చెప్పుకొచ్చు.

ఉన్నట్టుండి కమల్ రాజకీయాల్లోకి వచ్చారు. సినిమాలను మధ్యలో ఆపి రాజకీయ పార్టీ అన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి - తన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడానికి కమల్ తగినంత కసరత్తు అయితే చేయలేదు అనేది స్పష్టం అవుతున్న విషయం.

ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ హాసన్ పార్టీకి తమిళనాట కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా? అనేది సందేహంగానే కనిపిస్తూ ఉంది. విశ్లేషకులు అవే అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు!