కగిసో రబడా..ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు!

Sun Oct 18 2020 13:20:30 GMT+0530 (IST)

Kagiso Rabada is the only one in the history of IPL!

కగిసో రబడా అంతర్జాతీయ మ్యాచ్ లే కాదు. ఐపీఎల్లోనూ ఇరగదీస్తున్నాడు. తన పదునైన బంతులతో బెంబేలెత్తిస్తున్నాడు. సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఐపీఎల్ నిజం చెప్పాలంటే బ్యాట్స్ మెన్ ఆట. ఇక్కడ ఫోర్లు సిక్సర్లకే ప్రాధాన్యం. అందుకే బ్యాట్స్ మెన్ కి అనుకూలంగానే నిబంధనలు అన్ని ఉంటాయి. అలాంటి ఆటలో కూడా రబడా తన సత్తా చూపుతున్నాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఈ  స్టార్ పేసర్ తాజాగా  సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 50 ఐపీఎల్ వికెట్లను సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన  మ్యాచ్‌లో రబడా ఈ రికార్డును అందుకున్నాడు.  డుప్లెసిస్ వికెట్ తీయడం ద్వారా  రబడా తన 50వ ఐపీఎల్ వికెట్ మార్కును అందుకున్నాడు. 27వ ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే రబడా ఈ ఘనత సృష్టించి   సునీల్ నరైన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 50 ఐపీఎల్ వికెట్ల మార్కును బద్ధలు కొట్టాడు.
నరైన్ 32 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీయగా రబడా అతడికంటే  ఐదు మ్యాచ్‌లు ముందే ఈ రికార్డు అందుకున్నాడు.

 అత్యంత వేగవంతంగా వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో  రబడా నరైన్‌ల తర్వాత స్థానాల్లో మలింగా(33) ఇమ్రాన్ తాహీర్(35) మెక్‌లీన్‌గన్(36) అమిత్ మిశ్రా(37) ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్లో మరో రికార్డును అందుకున్నాడు. వేగవంతంగా అత్యధిక వికెట్లు తీయడమే కాదు అతి తక్కువ బంతుల్లో యాభై ఐపీఎల్ వికెట్లను సాధించి  అరుదైన రికార్డు నెలకొల్పాడు. రబడా 616 బంతుల్లో 50 ఐపీఎల్ వికెట్లను సాధించగా అతడి తర్వాతి స్థానంలో శ్రీలంక బౌలర్ మలింగా ఉన్నాడు. మలింగా 749 బంతుల్లో ఈ రికార్డు అందుకోగా సునీల్ నరైన్ 760 బంతుల్లో యాభై వికెట్ల మార్కుకు చేరుకున్నాడు. రబడా ఈ ఐపీఎల్లే కాదు గత సీజన్లోనూ 12 మ్యాచ్ లు 25 వికెట్లు తీసి సత్తా చాటాడు.