గ్రౌండ్ రిపోర్టు: కదిరి

Mon Mar 25 2019 11:01:47 GMT+0530 (IST)

Kadiri Constituency Ground Report

అనంతపురం జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కదిరి నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా వరుసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన చాంద్ బాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆయనకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కు టికెట్ కేటాయించారు. ఈ పరిస్థితుల్లో చాంద్ బాషా - కందికుంట వర్గం మధ్య ఆధిపోత్య పోరు కొనసాగుతుండటంతో వైఎస్సార్ సీపీ గెలుపు సులువు కానుందని అంచనా. అంతేకాకుండా వరుసగా ఏ పార్టీ రెండు సార్లు గెలవలేదు. ఏ ఎమ్మెల్యే కూడా అదే పార్టీలో రెండోసారి విజయం సాధించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి బరిలో దిగారు. ప్రస్తుతం ఆయన వైపు గాలి వీస్తోందని చెప్పవచ్చు. గత 1983 ఎన్నికల నుంచి పరిశీలిస్తే మహమ్మద్ షాక్రి మాత్రమే రెండుసార్లు కదిరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఒకసారి.. కాంగ్రెస్.. మరోసారి టీడీపీ నుంచి ఆయన విజయం సాధించారు. అంతేకానీ ఇంతవరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా వరుసగా ఒకే పార్టీలో గెలిచింది లేదు.. వరుసగా ఒకే పార్టీ విజయం సాధించింది లేదు.చివరి వరకూ ఊరించి ఇప్పుడు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పించేందుకు చంద్రబాబు నిరాకరించారు. గత ఎన్నికల్లో బాషా చేతిలో ఓడిపోయిన కందికుంట ప్రసాద్ కు ఈసారి సీటు ఖరారు చేశారు. చాంద్ బాషాకు మంత్రి పదవి ఇస్తానని చివరి వరకూ ఊరించి ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా పోయింది.

విజయావకాశాలు

– టీడీపీలో గ్రూపు రాజకీయాలు. ఎమ్మెల్యే చాంద్ బాషా వర్గం - మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వర్గం మధ్య అధిపత్య పోరు జరుగుతోంది.

– వైఎస్సార్ సీపీలో గెలిచిన చాంద్ బాషా 2016లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయనకు కందికుంట వర్గం నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. ఫలితంగా పాలన అటకెక్కింది.

– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పీవీ సిద్దారెడ్డి సామాన్య ప్రజలకు సుపరిచితుడు. డాక్టర్ గా ఎంతోమందికి సేవలు అందించారు.

– వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకం ప్రజల్లోకి తీసుకెళ్లారు.

– కదిరిలో నెలకొన్న సెంటిమెంట్ ల ప్రకారం టీడీపీ  వైఎస్సార్ సీపీకి 50 – 50 చాన్స్ ఉందని చెప్పవచ్చు.

కదిరి ఎమ్మెల్యేల జాబితా
1983 – మహమ్మద్ షాక్రి – టీడీపీ
1989 – మహమ్మద్ షాక్రి – కాంగ్రెస్
1994 – సూర్యనారాయణ – టీడీపీ
1999 – ఎంఎస్ పార్తసారథి – బీజేపీ
2004 – జొన్నా రామయ్య – కాంగ్రెస్
2009 – కందికుంట వెంకటప్రసాద్ – టీడీపీ
2014 – అత్తార్ చాంద్ బాషా – వైఎస్సార్ సీపీ