Begin typing your search above and press return to search.

ఈ ఆప‌త్కాలంలో తెలంగాణ‌లో ఈ ప్రారంభోత్స‌వాలేమిటో..

By:  Tupaki Desk   |   28 May 2020 1:30 PM GMT
ఈ ఆప‌త్కాలంలో తెలంగాణ‌లో ఈ ప్రారంభోత్స‌వాలేమిటో..
X
మ‌హ‌మ్మారి వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తోంది. తెలంగాణ‌లో బుధ‌వారం ఒక్క‌రోజే 107 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక కేసులు నమోదైన సంఖ్య ఇదే. ముఖ్యంగా హైద‌రాబాద్ ప‌రిధిలోనే భారీస్థాయిలో కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. హైద‌రాబాద్‌లోని కొత్త కొత్త ప్రాంతాల్లో కూడా వైర‌స్ వ్యాపిస్తోంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల‌కు కూడా ఆ మ‌హ‌మ్మారి పాకుతోంది. నారాయ‌ణ‌పేట‌, వికారాబాద్ త‌దితర జిల్లాలో తాజాగా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. రాష్ట్ర‌మంతా ఆ మ‌హ‌మ్మారి వైర‌స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే ప్ర‌భుత్వం మాత్రం ఇత‌ర ప‌నుల‌పై దృష్టి సారించింది. అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేయ‌డంలో బిజీగా అయ్యింది. వారం రోజులుగా ప‌రిశీలిస్తే తెలంగాణ‌లో రిబ్బ‌న్ క‌ట్ కార్య‌క్ర‌మాలు అధిక‌మ‌య్యాయి. ఇలాంటి ఆప‌త్కాలంలో ఇలాంటి కార్య‌క్ర‌మాలు అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న వ‌స్తోంది.

- రంగ‌నాయ‌క్ సాగ‌ర్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్‌, ఎంపీ ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రుల‌తో కలిసి ఒక పండుగ కార్య‌క్ర‌మంలా నిర్వ‌హించారు. కొన్ని రోజులకు కాల్వ‌ల‌కు నీళ్లు విడుద‌ల చేసే కార్య‌క్ర‌మం చేశారు. ఈ స‌మ‌యంలో ఎంపీ, ఎమ్మెల్యే కాలువ‌లో ఈత కొట్టి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని హంగుఆర్భాటాల‌తో భారీస్థాయిలో చేశారు.

- మొన్న‌టికి మొన్న సిరిసిల్లా జిల్లాలో మంత్రులు కేటీఆర్‌, నిరంజ‌న్ రెడ్డి ఇత‌రుల‌తో క‌లిసి గోదాముల నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఆ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. మ‌హ‌మ్మారి ప్ర‌బ‌ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కానీ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఆ వైర‌స్ ప్ర‌బ‌లుతూనే ఉంది. ఎవ‌రికైనా ఒక‌రికి ఉంటే పొర‌పాటున ఇత‌రుల‌కు వ్యాపిస్తే ఇక క‌ల్లోలం రేగే ప‌రిస్థితి.

- తాజాగా గురువారం ఎల్బీన‌గ‌ర్‌లో మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభోత్స‌వం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు హాజ‌ర‌య్యారు. మండుటెండ‌లో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని భారీస్థాయిలో చేప‌ట్టారు. ఇక్క‌డ కూడా కొంచెం అజాగ్ర‌త్త‌గా ఉన్నా వైర‌స్ వ్యాపించే ప్ర‌మాదం ఉంది. ముందే వ‌న‌స్థ‌లిపురం, ఎల్బీన‌గ‌ర్ ప్రాంతాల్లో ఇప్ప‌టికే చాలా కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే.

ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొం‌డ జిల్లా సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం గుంపులతిరుమలగిరి డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ను మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అట్ట‌హాసంగా ప్రారంభించారు.

ఇప్పుడు తాజాగా 29వ తేదీన శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రారంభోత్స‌వాన్ని అట్ట‌హాసంగా చేయ‌బోతున్నారు. భారీస్థాయిలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. దీనికి సంబంధించి చిన‌జీయ‌ర్‌స్వామిని క‌లిసి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ ప్రారంభోత్స‌వంలో హోమం, గంగాహార‌తి వంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక ఉంది. అంటే భారీస్థాయిలో ప్ర‌జాప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హాజ‌రుకానున్నారు.

ఇక జిల్లాల ప‌రిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు రిబ్బ‌న్ క‌ట్ కార్య‌క్ర‌మాలు భారీగానే చేస్తున్నారు. అభివృద్ధి ప‌నులు, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు వంటి కార్య‌క్ర‌మాల్లో మునిగి తేలుతున్నారు. వైర‌స్ వ్యాపిస్తున్న ఈ స‌మ‌యంలో ఇలాంటి కార్య‌క్ర‌మాలు అవ‌స‌ర‌మా అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ వ‌స్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటే వారి వెంట అధికారులు, పోలీసులతో పాటు స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద‌స్థాయిలో వ‌స్తారు. గుంపుగుంపులుగా ప్ర‌జ‌లు ఉండొద్ద‌ని ప్ర‌భుత్వ‌మే చెబుతుండ‌గా ప్ర‌జాప్ర‌తినిధులే ప‌ట్టించుకోకుంటే ఎలా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక‌వేళ ప్రారంభోత్స‌వం చేయాల‌నుకుంటే.. ఆ కార్య‌క్ర‌మం త‌ప్ప‌నిస‌రి అయితే కార్యాల‌యం నుంచే రిమోట్ ద్వారా ప్రారంభోత్స‌వం చేయ‌వ‌చ్చు క‌దా అని స‌ల‌హా ఇస్తున్నారు. ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర మంత్రులు ఇదే త‌ర‌హాలో ప్రారంభోత్స‌వాలు సాధార‌ణ స‌మ‌యంలోనే చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి ప‌నులు చేయాల‌ని సూచిస్తున్నారు. ఇంకా భ‌విష్య‌త్‌లో దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ ట‌వ‌ర్‌, పంజాగుట్ట‌లో స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్స‌వాలు కూడా త్వ‌ర‌లోనే ఉన్నాయి. వాటిని కూడా అట్ట‌హాసంగా నిర్వ‌హించేలా ప్ర‌ణాళిక ఉంది. ఈ విధంగా హంగుఆర్భాటాల‌తో కార్య‌క్ర‌మాలు చేస్తే క‌ష్ట‌మ‌ని పేర్కొంటున్నారు.

కొన్నాళ్లు వాటిని విర‌మించుకోవాల‌ని లేదా ప్రారంభోత్స‌వాలు కొద్దిమంది స‌మ‌క్షంలో నిర్వ‌హించాల‌ని ప్ర‌జ‌లు, వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి కార్య‌క్రమాలు నిర్వ‌హించిన స‌మ‌యంలో ఎవ‌రికో ఒక‌రికి వైర‌స్ ఉండి ఉంటే భారీస్థాయిలో న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.