Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీ ట్వీట్ కు కేటీఆర్ రీ ట్వీట్...వైరల్

By:  Tupaki Desk   |   21 Sep 2020 5:33 PM GMT
ప్రధాని మోడీ ట్వీట్ కు కేటీఆర్ రీ ట్వీట్...వైరల్
X
వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020, ధరల హామీ, పంట సేవల అంగీకార బిల్లు-2020, నిత్యవసర ఉత్పత్తుల (సవరణ) బిల్లు-2020లకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో ఈ బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడం దుమారం రేపింది. కాంగ్రెస్, బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌, శివసేన, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, ఆమాద్మీ పార్టీలు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.ఈ బిల్లులతో రైతులకు మరణ శాసనం రాస్తున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. మరోవైపు, రైతుల మేలు కోసం ప్రవేశ పెట్టిన ఈ బిల్లులు భారతీయ వ్యవసాయరంగంలో చరిత్రాత్మకమైనవని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కోట్లాదిమంది రైతులకు ఈ బిల్లుల ద్వారా లబ్ధి చేకూరుతుందని మోడీ ట్వీట్ చేశారు. ఇక, రాజ్య‌స‌భ‌లో ఈ బిల్లుల‌ను టీఆర్ఎస్ పార్టీ వ్య‌తిరేకించడాన్ని తెలంగాణ బీజేపీ త‌ప్పు ప‌ట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ట్వీట్ ని, తెలంగాణ బీజేపీని ఉద్దేశించి తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులు నిజంగా చ‌రిత్రాత్మ‌క‌మే అయితే...దేశవ్యాప్తంగా రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవ‌డం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఈ బిల్లులు రైతులకు మేలు చేసేవే అయితే ఎన్‌డీఏ భాగ‌స్వామ్య ప‌క్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని ప్రశ్నించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లును అసెంబ్లీ సవరణలు లేకుండానే ఆమోదించిందని, ఆ సమయంలో రైతులంతా రాష్ర్ట వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అకాళీదళ్ కు చెందిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ రాజీనామా చేయడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేటీఆర్ అడిగిన ప్రశ్నకు తెలంగాణ బీజేపీ పెద్దలు ఏం సమాధానమిస్తారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.