Begin typing your search above and press return to search.

వైరల్ పోస్టులకు కేటీఆర్ పంచ్.. వర్షం పడితే డల్లాస్ లో అయినా ఇంతే

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:45 AM GMT
వైరల్ పోస్టులకు కేటీఆర్ పంచ్.. వర్షం పడితే డల్లాస్ లో అయినా ఇంతే
X
గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ లో కురిసే వర్షాల కారణంగా.. జలమయం అయ్యే ప్రాంతాలను చూపిస్తూ.. సోషల్ మీడియాలో ఒకపోస్టు తరచూ వైరల్ అవుతూ ఉంటుంది. ఆ పోస్టులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు ఒక ఫ్రేమ్ లో.. మరో ఫ్రేమ్ లో హైదరాబాద్ లో వర్షం కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్ని చూపించటం తెలిసిందే. ఆ వీడియోలో.. హైదరాబాద్ ను విశ్వనగరంగా మారుస్తానని.. డల్లాస్.. న్యూయార్కు మాదిరి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పటం కనిపిస్తుంది.

డల్లాస్.. న్యూయార్కు అంటావు సారూ.. ఇక్కడ పరిస్థితి జర జూడండంటూ పోస్టులో అదే పనిగా వైరల్ కావటం తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఇంత ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ మాటల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుంది. హైదరాబాద్ మహానగరంలోవర్షం కారణంగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వివరించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాటల్లో డల్లాస్ వైరల్ పోస్టు ప్రస్తావన వచ్చింది.

తనకు తానే ఈ పోస్టును ప్రస్తావిస్తూ.. ‘ఇదేనా డల్లాస్.. ఇదేనా న్యూయార్క్ అని సోషల్ మీడియాలో వీడియోలు పెడ్తున్నారు. అయ్యా.. ఈ స్థాయిలో వర్షం పడితే డల్లాస్.. న్యూయార్క్ లలో కూడా పరిస్థితులు ఇట్లనే ఉంటయి’ అంటూ కేటీఆర్ పంచ్ వేసే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయన ఆశించినంతగా పంచ్ పేల్లేదన్న మాట వినిపిస్తోంది. ఈ వారంలో పడిన వర్షాలకుఈ మాటలు అంటున్నారు. నెల క్రితం పడిన ఒకపూట వర్షానికి నగరంలోని కొన్ని ప్రాంతాలు ఆగమాగం కావటాన్ని ఏమంటారు? అని ప్రశ్నిస్తున్నారు.

డల్లాస్.. న్యూయార్కు సిటీలో ఇంత భారీగా వర్షం పడితే.. నివాసిత ప్రాంతాల్లో నాలుగైదు రోజుల తరబడి వరద నీరు నిలిచిపోయే పరిస్థితి ఉంటుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశ్వ నగరాలుగా చెప్పుకునే సిటీల్లో క్లౌడ్ బరస్ట్ అయినప్పుటు ఎవరూ ఏమీ చేయలేరని.. ముంబయి.. చెన్నై.. బెంగళూరుల్లో కూడా ఇదే పరిస్థితిని చూశామంటూ మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు అతికినట్లుగా లేవన్న మాట వినిపిస్తోంది. డల్లాస్.. న్యూయార్క్ నగరాలు కూడా ఇంత వర్షాల పడితే.. ఇలానే పరిస్థితి ఉంటుందని సర్ది చెబుతున్న మంత్రి కేటీఆర్.. భారీ వర్షాలు పడితే అలెర్టు చేసే వ్యవస్థలు అక్కడ చాలానే ఉన్నాయి? మరి.. మన హైదరాబాద్ లో లేవేం? అంటూ పోలికల వేళ కొత్త పాయింట్లు తీస్తున్నారు.