Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి అంటే.. ముఖ్యమంత్రి కావొద్దనేగా.. ఒప్పుకుంటారా కేటీఆర్?

By:  Tupaki Desk   |   14 Jan 2022 4:34 AM GMT
కేంద్ర మంత్రి అంటే.. ముఖ్యమంత్రి కావొద్దనేగా.. ఒప్పుకుంటారా కేటీఆర్?
X
ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ ఒకేలాంటి చురుకుదనం అంత తేలికైన విషయం కాదు. అందునా రాజకీయాల్లో ఇలా మొయింటైన్ చేయటం నేతలందరికి సాధ్యమయ్యే పని కాదు. గల్లీలోకి వెళ్లినప్పుడు.. అక్కడి స్థానికులతో మాట్లాడే వేళలో ఎంత కంఫర్ట్ గా ఉంటారో.. ఆన్ లైన్ లో నెటిజన్లతో చాట్ చేసే వేళలోనూ.. వారి స్పీడ్ కు తగ్గట్లు సమాధానాలు చెప్పే విషయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు మంచి మార్కులే పడతాయి. తాజాగా ఆయన.. ‘ఆస్క్ యువర్ కేటీఆర్’ కార్యక్రమాన్ని చేపట్టారు.

మంత్రి కేటీఆర్ తో మాట్లాడటానికి.. ఆయన్ను ప్రశ్నలు అడగటానికి ఎవరికి మాత్రం ఉత్సాహం ఉండదు చెప్పండి. అందుకే.. చిన్నసారు లైన్లోకి వచ్చినంతనే.. ప్రశ్నల వర్షం కురిపించేశారు. తనకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలకు చప్పున బదులిచ్చిన ఆయన.. తనను ఇరుకున పడేసే ప్రశ్నల విషయంలో మాత్రం తెలివిగా స్కిప్ చేసిన వైనాన్ని మెచ్చుకోవాల్సిందే.

ఒక నెటిజన్ తన ప్రశ్నను సంధిస్తూ.. కేటీఆర్ కేంద్ర మంత్రి కావాలని తన మనసులోని కోరికను ఒక నెటిజన్ బయటపెట్టగా.. అందుకు బదులిచ్చిన మంత్రి కేటీఆర్.. సొంత రాష్ట్రానికి సేవ చేస్తూ సంతోషంగా ఉన్నట్లుగా బదులిచ్చారు. తన సమాధానం ద్వారా.. తాను రాష్ట్రంలో పని చేయటానికే ఎక్కువ ఆసక్తి ఉందన్న విషయాన్ని చెప్పేశారు. ప్రజలు శాంతి.. సుస్థిరత కోరుకుంటున్నారని.. తమ ప్రభుత్వం సుపరిపాలన.. డెవలప్ మెంట్ మీద ఫోకస్ చేస్తుందన్నారు.

జాతీయ రాజకీయాల మీద ఆసక్తి లేదన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటను వింటే.. కొన్నేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధనే తనకు ముఖ్యమని.. తెలంగాణ బాగోగులే తనకు అత్యంత ప్రాధాన్యత అంశంగా కేసీఆర్  చెప్పటం.. ఇప్పుడు తెలంగాణలో తమ పార్టీ కుదురుకున్న వేళ.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న విషయాన్ని ఇటీవల కాలంలో కేసీఆర్ పదే పదే చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లే హోం వర్కు చేయటం తెలిసిందే.

అయినా.. తన తండ్రి కేసీఆర్ జాతీయరాజకీయాల వైపు వెళితే.. రాష్ట్రాన్ని ఎవరు చూసుకుంటారు? అయినా.. చూస్తూ.. చూస్తూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలేసి ఎవరైనా కేంద్ర మంత్రి పదవిని టార్గెట్ చేస్తారా చెప్పండి. రానున్న రోజుల్లో సీఎం కుర్చీలో కూర్చునేందుకు తగ్గట్లు గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉన్న వేళ.. హైదరాబాద్ వదిలేసి.. ఢిల్లీకి ఎందుకు వెళతారు చెప్పండి? అయినా.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపించే కేటీఆర్ మాష్టార్ని.. కేంద్ర మంత్రి కావాలని కోరకుంటే అవుతారా ఏంటి?