కారు ఫుల్ అయిపోయిందట..!

Thu Aug 02 2018 12:43:54 GMT+0530 (IST)

ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరిగే వేళ.. నోటి నుంచి వచ్చే మాటలకు కంట్రోల్ ఉండదు. అయితే.. ఇలాంటి బడాయి మాటలు కొన్నిసార్లు బాగానే ఉన్నా.. మరికొన్నిసార్లు నెగిటివ్ గా మారి.. అసలుకే ఎసరు వచ్చేలా మారుతుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నోటి నుంచి వినిపిస్తున్నాయి. పేరుకు కేసీఆర్ ముఖ్యమంత్రే అయినా.. ఆ పనులను వీలైనంత ఎక్కువగా కేటీఆరే మీదేసుకొని మరీ నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దీనికి బలం చేకూరేలా కేటీఆర్ తీరు ఉంటోంది కూడా. తెలంగాణ రాష్ట్రానికి ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరయ్యే కార్యక్రమాల లీడ్ ను కేటీఆర్ తీసుకోవటం కొంతకాలంగా కనిపిస్తున్నదే. ఇప్పుడు.. రాజకీయ ప్రత్యర్థులపైనా తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు.

తాను యాక్టివ్ గా ఉండటం ద్వారా.. తండ్రి కేసీఆర్ మీద భారాన్ని తగ్గించే దిశగా కేటీఆర్ అడుగులు పడుతున్నట్లుగా చెప్పక తప్పదు.

తాజాగా నిజామాబాద్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటల్నిచూస్తే.. ఆయన మాటల్లో బడాయితనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఉత్తమ్.. జానా తప్పించి కాంగ్రెస్ పార్టీలో నేతలంతా గులాబీ కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న వారేనని... అయితే.. వారిని ఎక్కించుకోవటానికి తమ దగ్గర ఖాళీ లేదని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ చెప్పిన మాటలు నిజం ఎంతన్నది చూస్తే.. కొంచెమేనని ఇట్టే అర్థమవుతుంది.జానా.. ఉత్తమ్ కాకుండా జైపాల్ రెడ్డి.. కోమటిరెడ్డి.. భట్టి.. డీకే అరుణ.. రేవంత్.. వీహెచ్.. సబిత..గీతారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు కనిపిస్తారు. వీరంతా పదవులు లేకున్నా ఊరుకుంటారు కానీ టీఆర్ ఎస్ లో చేరేందుకు ఏ మాత్రం ఇష్టపడరు.

కానీ.. కేటీఆర్ మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ నేతల్లో నైతిక స్థైర్యం తగ్గేలా.. ఏదో మునిగిపోతుందన్న భావన కలిగించేలా కేటీఆర్ మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. ఎక్కడి వరకో ఎందుకు.. హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ ను పార్టీలోకి తెచ్చేందుకు కేసీఆర్ అండ్ కో ప్రయత్నాలు చేయటం.. అది ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. ముఖేశ్ గౌడ్ లాంటి నేతను గులాబీ కారు ఎక్కించటానికి కిందా మీదా పడుతున్న టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్ కు చెందిన నేతలంతా గంపగుత్తగా సిద్ధంగా ఉన్నారన్న కేటీఆర్ మాట బడాయే తప్పించి మరింకేమీ లేదన్నది మర్చిపోకూడదు. ఈ తరహా మాటలు.. అహంభావానికి నిదర్శనంగా ఫీలైతే.. తిప్పలు తప్పవని చెప్పాలి. మరీ.. విషయాల మీద కేసీఆర్ దృష్టి పెడుతున్నారంటారా?