కేటీఆర్ వేసిన పంచ్ మల్లారెడ్డికి అర్థం కాలేదా?

Tue Jul 12 2016 15:25:05 GMT+0530 (IST)

KTR Satires on Malla Reddy

    మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి ఎక్కడుంటే అక్కడ మంచి మజా ఉంటుంది.. మాటలతోనే కాదు ఆటపాటలతోనూ ఆయన అదరగొడుతుంటారు. రాజకీయ నేతగానే కాకుండా విద్యాసంస్థల అధిపతిగానూ ఆయనకు సమాజంలో మంచి హోదా ఉన్నా తరచూ ఆయన దాన్ని పక్కనపెట్టి జనంలోకి కలిసిపోయేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా తన కళాశాలల్లో జరిగే కార్యక్రమాల్లో విద్యార్థులను ఉర్రూతలూగించేలా మాట్లాడుతుంటారు. అంతేకాదు.. వారితో కలిసి స్టెప్పులు కూడా వేస్తుంటారు.  పబ్లిక్ లో ఏమాత్రం సంకోచం లేకుండా వ్యవహరించే ఈ ఎంపీగారు టీడీపీ నుంచి గెలిచినా రీసెంటుగా టీఆరెస్ లో చేరిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన టీఆరెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ఆయన హరిత హారం కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అక్కడ ఆసక్తికర పరిణామాలు జరిగాయి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు - మంత్రి కేటీఆర్ నవ్వుతూనే మల్లారెడ్డిపై సెటైర్లు వేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజిలో హరిత హారం కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కేటీఆర్ ను పిలిచారు. కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డి మైకు అందుకుని తనదైన స్టైల్లో ప్రసంగించారు. మాస్ డైలాగులు.. హుషారెత్తించే వ్యాఖ్యలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. అంతేకాదు.. తనకు ఎప్పుడై అలవాటైన స్టైల్లో నాలుగు స్టెప్పులు కూడా వేశారు. ఇదంతా చూస్తున్న కేటీఆర్ కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించారట. మల్లారెడ్డి చిందులు చూసి చివరకు ఆయన కూడా నవ్వు ఆపుకోలేకపోయారట.

ఆ తరువాత ప్రసంగించిన కేటీఆర్ తన ప్రసంగాన్ని మొదలుపెడుతూనే మల్లారెడ్డి అన్న పదంతో ప్రారంభించారు. మల్లారెడ్డి హుషారైన ప్రసంగం తరువాత తాను ఇంకా మాట్లాడడం అనవసరం అని.. తన ప్రసంగం తేలిపోతుందని అంటూ .. మాంచి బిర్యానీ తిన్న తరువాత పప్పన్నం తిన్నట్లు ఉంటుందని అన్నారు. అంతేకాదు.. అక్కడే ఉన్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ వైపు చూస్తూ.. మా ఎంపీగారికి మీ సినిమాల్లో అవకాశమివ్వండి అన్నారు. ‘‘మా ఎంపీ కంటే గొప్ప నటుడు - మంచి డ్యాన్సర్ మీకు దొరకడు’’ అని కేటీఆర్ అనడంతో నవ్వులు పూశాయి. అయితే.. కేటీఆర్ మాటల్లోని వ్యంగ్యాన్ని మాత్రం మల్లారెడ్డి అర్థం చేసుకున్నట్లుగా లేదు.