కేటీఆర్ పీఏ అంటూ మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్ .. ఇంతకీ అతనెవరో తెలుసా !

Sat Mar 06 2021 18:09:10 GMT+0530 (IST)

KTR PA man arrested for cheating .. Do you know who he is yet!

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  పీఏ అని చెప్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. . తాను కేటీఆర్ పీఏనని చెప్పి.. పలువురు వ్యాపారవేత్తలకు ఫోన్‌లు చేసి బెదిరింపులకి దిగుతున్నాడు. తాజాగా ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ఫోన్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిసార్లు కేసులు పెట్టినా అతనిలో మార్పు రావడంలేదు.నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా  బషీర్ బాగ్ లోని సీపీ ఆఫీసులో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనికుమార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పీఏను అంటూ మోసాలకు పాల్పడుతున్న నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. 9 కార్పొరేట్ కంపెనీలను మోసం చేసి 39 లక్షల 22వేల 400 రూపాయలు వసూలు చేశాడని అలాగే హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు విద్యా సంస్థల నిర్వాహకులను కూడా మోసం చేశాడన్నారు. బంజారాహిల్స్ మాదాపూర్ కూకట్ పల్లి గచ్చి బౌలి పోలీస్ స్టేషన్లలో ఇతడి పై కేసులు ఉన్నాయని ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నాగరాజు పై ఉన్నాయని వివరించారు. గతంలో నాగరాజు పై తెలంగాణతోపాటు ఏపీ లో 10 కేసులు ఉన్నాయని సైబరాబాద్ గుంటూరు వైజాగ్ లో ఇతడిపై ఛీటింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు.  

గతంలో పొల్యూషన్ బోర్డులో ఉన్నతాధికారులు తనకు తెలుసని కలరింగ్ ఇచ్చి.. నోటీసులు ఇవ్వకుండా చూస్తానని చెప్పి.. ఓ ఫార్మా కంపెనీ వద్ద రూ.15 లక్షలు కాజేశాడు. గత ఏడాది డిసెంబరులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి కాల్ చేసి.. ఏపీకి చెందిన ఓ నిరుపేద క్రికెటర్ అండర్19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడని.. అతడిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు. రూ.3.3 లక్షలు కావాలని కోరడంతో.. మోసాన్ని గ్రహించి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు గతంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరు వాడుకుని మోసాలకు పాల్పడ్డాడు. అప్పట్లో ఇది సంచలన సృష్టించింది. ఓ వ్యక్తికి కాల్ చేసి... తాను ఎమ్మెస్కే ప్రసాద్‌నని చెప్పి రూ.2.88 లక్షలు వసూలు చేశాడు. మరో సొసైటీ నుంచి కూడా రూ.3.88 లక్షల మేర టోకరా పెట్టాడు. ఆ క్రమంలో పలువురి నుంచి ఎమ్మెస్కేకు ఫోన్లు వెళ్లాయి. నీ పేరుతో ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పడంతో.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీసులు నాగరాజను అరెస్ట్ చేశారు. ఇలా పలుమార్లు అరెస్టైనా.. అతడికి బుద్ధి రావడం లేదు. బెయిల్‌పై బయటకొచ్చి.. మళ్లీ మోసాలు చేయడం నిత్య కృత్యంగా మార్చుకున్నాడు. నాగరాజుపై పీడీ యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేశారు.  

ఇదిలా ఉంటే .. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం యవ్వారిపేట. వయసు 26 ఏళ్లు. ఎంబీఏ వరకు చదువుకున్నాడు. గతంలో ఆంధ్రా రంజీ టీమ్‌లో ఉన్న సమయంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2006లో అండర్-14 విశాఖ జట్టుకు ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2014లో ఆంధ్రా రంజీ జట్టకు ఎంపికై.. పలు మ్యాచ్ లు ఆడాడు నాగరాజు. ఇక 2016లో నెట్స్ లో ఏకధాటిగా 82 గంటల పాటు బ్యాటింగ్ చేసి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. నాగరాజు ఆటకు ముగ్ధులై ఎంతో మంది దాతలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ ఆ డబ్బులతో జల్సాలు చేసి చెడు మార్గం వైపు నడిచాడు. ప్రస్తుతం ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడు.