తెలంగాణలోనే ఇక మెట్రో రైళ్ల తయారీ

Thu Aug 13 2020 19:00:01 GMT+0530 (IST)

Manufacture of metro trains in Telangana

తెలంగాణ రాష్ట్రానికి మరో వరం దక్కింది. ఏకంగా ప్రైవేట్ మెట్రో రైళ్ల తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటవుతోంది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ తోపాటు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి గురువారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మెట్రో రైళ్లను కొరియా నుంచి తెచ్చుకుంటున్నామని.. ఇక మీదట తెలంగాణలోనే తయారుకాబోతున్నాయని తెలిపారు. తెలంగాణ స్వయం సంవృద్ధి సాధించిన రాష్ట్రం కావాలని ఆకాంక్షించారు. గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లు అందుబాటులోకి వస్తే పౌరుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణకు కేంద్రం చేయూతనివ్వాలని.. వరంగల్ లోనూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పడ్డాక పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.

100 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికంగా ఉండబోతోందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తోపాటు మంత్రులు సబితా హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు.