Begin typing your search above and press return to search.

క్లబ్లు, పబ్లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు: కేటీఆర్ ఫైర్‌

By:  Tupaki Desk   |   14 May 2022 3:30 PM GMT
క్లబ్లు, పబ్లు తప్ప ఏం తెలియని వాళ్లు.. మరో అవకాశం అడుగుతున్నారు: కేటీఆర్ ఫైర్‌
X
సాగు, తాగు నీరులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతులకు ఏదో చేస్తామంటూ కొందరు వస్తుంటారని.. వాళ్లను నమ్మొద్దని హితవు పలికారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం.. కేటీఆర్ హాలియాలో పర్యటించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు.

ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్.. రాష్ట్రానికి ఏమీ చేయలేదని కేటీఆర్ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో.. సాగు, తాగునీటితో దేశానికే ఆదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు. ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు.

హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ఇన్టెక్వెల్ ప్రాజెక్టుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. రాబోయే 50 ఏళ్లకు నీటికొరత రాకుండా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అనంతరం హాలియాలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

రూ.46 వేల కోట్లు ఖర్చుపెట్టి మిషన్‌ భగీరథ తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. పేదలకు అండగా ఉన్నాం కాబట్టే పింఛన్‌ను పది రెట్లు పెంచామన్నఆయన.. ఆరోగ్యలక్ష్మి ద్వారా తల్లీబిడ్డకు పౌష్ఠికాహారం అందిస్తున్నామని చెప్పారు.

సన్నబియ్యంతో పౌష్ఠికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యాసంస్థలు ప్రారంభించామని.. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇస్తున్నామని వివరించారు.

''ఆరేడు దశాబ్దాలు పాలించిన వాళ్లు.. ఏం చేయలేదు. ఇప్పుడు మళ్లీ మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. రైతులకు ఏదో చేస్తామంటూ కొంతమంది వస్తుంటారు.. వాళ్లను నమ్మొద్దు. మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతుంటారు. క్లబ్‌లు, పబ్‌లు తప్ప ఆయనకేమీ తెలియదు. ఎన్నికలు రాగానే వస్తుంటారు... మాయమాటలు చెప్పి వెళ్తారు'' అని విరుచుకుప‌డ్డారు.