Begin typing your search above and press return to search.

ఆస్తుల న‌మోదు కోసం అణా పైసా ఇవ్వాల్సిన పనిలేదు : మ‌ంత్రి కేటీఆర్

By:  Tupaki Desk   |   26 Sep 2020 11:31 AM GMT
ఆస్తుల న‌మోదు కోసం అణా పైసా ఇవ్వాల్సిన పనిలేదు : మ‌ంత్రి కేటీఆర్
X
జీ హెచ్ ఎం సీ పరిధిలో కొన్ని కాలనీల్లో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీకి వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాల గురించి.. వాటి ఆవశ్యకత గురించి ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది అని కేటీఆర్ తెలిపారు.

సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా అండగా ఉంటామని అన్నారు. అవినీతికి స్థానం లేకుండా కొత్త చట్టానికి ఆమోదం తీసుకున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా ఉందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా.. పేద, మధ్య తరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని, అలాగే దళారులని నమ్మి ఎవరు మోసపోవద్దని , ఎవరిని అణా పైసా కూడా ఇవ్వాల్సిన పనిలేదని తెలిపారు.