Begin typing your search above and press return to search.

కేటీఆర్, జగన్.., రాహుల్.. ఒకేచోట ఒకే సమయంలో

By:  Tupaki Desk   |   22 May 2022 11:08 AM GMT
కేటీఆర్, జగన్.., రాహుల్.. ఒకేచోట ఒకే సమయంలో
X
అనుకొని వెళ్లడం వేరు.. అనుకోకుండా ఒకేచోట ఉండడం వేరు.. అనుకొని వెళ్తే ఎవరికీ ఏమీ అనిపించదు. కానీ, అనూహ్యంగా అందరూ ఒకేచోట ఉన్నట్లు తెలిస్తే అది అనూహ్యమే. ఇదే మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కీలక నేతలు కేటీఆర్, జగన్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విషయంలో వినిపిస్తోంది. అనూహ్యంగా ఈ ముగ్గురూ ఒకే సమయంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ లో ఉండడం ఓ విశేషమే మరి.

దావోస్ వెళ్లబోయి లండన్
ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు దావోస్ వేదికగా మారిన సంగతి తెలిసిందే. కీలక నేతలందరూ ఈ సదస్సుకు వచ్చి తమ ప్రాంతంలో వ్యాపార అవకాశాల గురించి వివరించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంటారు. ఇందుకోసం సదస్సులో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ఏటా జరుగుతుంది. అయితే, కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి ఇందుకు అవకాశం లేకపోయింది. ఈ సారి కొవిడ్ అడ్డంకులు తొలగడంతో సదస్సును ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం సదస్సు ప్రారంభమైంది.

తెలంగాణ నుంచి కేటీఆర్,
పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. కైటెక్స్ పరిశ్రమ కేరళ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నప్పుడు.. కేటీఆర్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులను తెలంగాణకు తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇవ్వకుండా తెలంగాణలోని వరంగల్ లో కెటెక్స్ భారీ యూనిట్ ఏర్పాటు చేసేలా చూశారు. అంతేకాక రెండు నెలల కిందట అమెరికా వెళ్లి తెలంగాణలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అక్కడివారిని ఒప్పించారు. తాజాగా దావోస్ సదస్సుకు తెలంగాణ ప్రతినిధిగా కేటీఆర్ వెళ్లారు. అయితే, ముందుగా ఆయన పర్యటన నేరుగా దావోస్ కే ఖరారైంది. మధ్యలో అనూహ్యంగా మారింది. లండన్ లో కొద్ది సమయం ఉండాల్సి వచ్చింది.

ఏపీ నుంచి జగన్, మంత్రి
ఏపీలో జగన్ ప్రభుత్వం 2019 మేలో ఏర్పాటైంది. అప్పటికే దావోస్ సదస్సు ముగిసింది. ఇక గత రెండేళ్లు కరోనాతో సదస్సు జరగలేదు. దీంతో వెళ్లేందుకు ఏపీకి అవకాశం చిక్కలేదు. దావోస్ కు వెళ్లకున్నా.. అప్పట్లో దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి పెట్టుబడుల కోసం తనవంతు ప్రయత్నాలు చేసేవారు. అయితే, ఇటీవల ఆయన ఆకస్మిక మరణంతో కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ దావోస్ వెళ్లారు. అయితే, ఈసారి ఏకంగా ఏపీ సీఎం జగన్ కూడా దావోస్ పయనం కావడం ఏపీలో పెట్టుబడుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పుకొనేందుకు అవకాశం ఇచ్చింది. అయితే, జగన్ కూడా దావోస్ వెళ్తూ మధ్యలో లండన్ లో కాసేపు ఆగారు. దీనిపై రకరకాల మాటలు వచ్చినా.. కేవలం ప్రయాణ బడలిక నేపథ్యంలోనే జగన్ పర్యటనకు లండన్ లో విరామం ఇచ్చారని స్పష్టమైంది.

విదేశం నుంచి భారత్ పై రాహుల్ ధ్వజం
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రస్తుతం లండన్ లోనే ఉన్నారు. ఈయన పర్యటన కూడా అనూహ్యంగానే ఉంది. కేటీఆర్ పర్యటనలో నేరుగా దావోస్ బదులు లండన్ లో ఆగుతారని స్పష్టమైన మరుసటి రోజే రాహుల్ లండన్ వెళ్లారు. ఇది ఓ విధంగా చూస్తే అనూహ్య పరిణామంగానూ కనిపించింది. మరోవైపు లండన్ లో 'ఐడియాస్ ఫర్ ఇండియా' సమ్మేళనంలో పాల్గొన్న రాహుల్.. భారత్ లో బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు. ఏకంగా పాకిస్థాన్ తరహా పాలనంటూ మండిపడ్డారు. విదేశీ గడ్డమీద.. అదికూడా వందల ఏళ్ల పాటు మనల్ని పాలించి భారత్, పాకిస్థాన్ గా విభజించిన బ్రిటన్ నుంచి ఈ తరహా విమర్శలు రాహుల్ స్థాయికి తగినవా? అనే వ్యాఖ్యలు వచ్చాయి. అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏమంటే.. రాహుల్ కూడా కేటీఆర్, జగన్ లానే లండన్ లో ఉండడం.

గుసగుసలు స్టార్ట్
ముగ్గురు కీలక నేతలు ఒకేచోట, ఒకే టైమ్ లో ఉండడాన్ని గమనించి రాజకీయ విశ్లేషకులు.. ఏంటి అందరూ ఒకే టైమ్ లో ఒకే ప్లేస్ లో ఉన్నారే? ఇది కో ఇన్సిడెన్స్ మాత్రమేనా? ఇంకా ఏమైనా ఉందా? అని గుసగులాడుతున్నారు. అయితే, కేటీఆర్, జగన్ పర్యటన షెడ్యూల్ లండన్ నుంచి దావోస్ కు మారుతుండగా.. రాహుల్ కొద్ది రోజులు లండన్ లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి.. అదీ విషయం.