Begin typing your search above and press return to search.

యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పేసిన కేటీఆర్

By:  Tupaki Desk   |   14 Jan 2022 2:39 AM GMT
యూపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో చెప్పేసిన కేటీఆర్
X
దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే సత్తా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. దేశ రాజకీయ సమీకరణాలన్ని మారిపోవటం ఖాయమని చెప్పాలి. అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీలో గెలుపు అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ అండ్ కో.

2014 ఎన్నికల్లో.. 2019 ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు బీజేపీ సొంతమయ్యాయి అంటే.. అందుకు కారణం ఉత్తరప్రదేశ్ లో సాధించిన అత్యధిక సీట్లే. అందుకే.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని అధిక్యను ప్రదర్శించాలని భావిస్తున్న మోడీ సర్కారు.. ఇప్పటికే అందుకు తగ్గట్లు.. త్వరలో జరిగే యూపీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల్ని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవటానికి పెద్ద ఎత్తున అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఇలాంటివేళ.. యూపీలో జరగనున్న ఎన్నికల్లో విజయం ఎవరు సాధిస్తారన్న ప్రశ్నను మంత్రి కేటీఆర్ కు సంధించారు ఒక నెటిజన్. దీనికి బదులిచ్చిన ఆయన.. ప్రస్తుతం యూపీలో సమాజ్ వాదీ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఓవైపు సర్వే రిపోర్టులన్ని కూడా యోగి సర్కారుకు అనుకూలమని నొక్కి వక్కాణిస్తుంటే.. అందుకు భిన్నంగా మంత్రి కేటీఆర్ అంచనా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన చెప్పినట్లే యూపీలో సమాజ్ వాదీ పార్టీనే విజయం సాధిస్తుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.