Begin typing your search above and press return to search.

రేపిస్ట్ రాజు సూసైడ్ పై స్పందించిన కేటీఆర్, చిరంజీవి, మంచు మనోజ్

By:  Tupaki Desk   |   16 Sep 2021 10:30 AM GMT
రేపిస్ట్ రాజు సూసైడ్ పై స్పందించిన కేటీఆర్, చిరంజీవి, మంచు మనోజ్
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ రేపిస్ట్ చివరకు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకొని కుక్కచావు చచ్చాడు. ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన ఈ క్రూరుడు కోసం పోలీసులు జల్లెడ పడుతున్న వేళ రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు.

సైదాబాద్ నిందితుడిపై ఇటు సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా అందరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. విషయం పెద్దది అవ్వడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్ గా తీసుకొని రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10లక్షల బహుమానం ప్రకటించారు.

ఈరోజు రాజు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకొని కనిపించడంతో ఈ ఘటన ముగిసినట్టైంది. చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉండడంతో ఇతడిని రాజుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. రాజు చనిపోయినట్టు వార్తలు రావడం చూసి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడు రాజు ఆత్మహత్యపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్నారిపై ఘోరానికి పాల్పడిన మృగం మృతదేహం స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ మీద పడి ఉందని తెలంగాణ డీజీపీ చెప్పారని కేటీఆర్ ట్వీట్ చేశాడు. గతంలో రాజును అరెస్ట్ చేసినట్లు తనకు తప్పుడు సమాచారం వచ్చిందని.. అందుకు చింతిస్తున్నట్టు పేర్కొన్నాడు.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం దీనిపై ట్వీట్ చేశాడు. ‘అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనను తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతోపాటు కొంతమందికి ఊరటను కలిగిస్తోంది. ఈ సంఘటనపై మీడియా, పౌరసమాజం స్పందించిన తీరు గొప్పగా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వంతోపాటు పౌర సమాజం కూడా చొర చూపాలి. వారికి నా సపోర్ట్ ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశాడు.

-హర్షం వ్యక్తం చేసిన మంచు మనోజ్

నిందితుడు రాజు చనిపోయాడని కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేసిన మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉందని.. దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఇటీవలే చైత్ర కుటుంబాన్ని పరామర్శించి మరీ వారికి తన సానుభూతిని తెలియజేశాడు హీరో మంచు మనోజ్.