ఆ గ్రామపెద్దను లోపలేశారు.. మిగిలినోళ్ల మీద కేసులు పెట్టారు

Sun Aug 18 2019 16:22:57 GMT+0530 (IST)

KP Doddi Village

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అనంతపురం జిల్లా కేపీదొడ్డి ఆరాచకపు ఘటనలో కీలకమైన గ్రామపెద్దను జైలుకు తరలించారు. ఇద్దరు మైనర్లు ప్రేమించుకొని.. గ్రామం నుంచి పారిపోయిన నేపథ్యంలో.. వారిని వెతికి పట్టుకోవటమే కాదు.. గ్రామసభ ఏర్పాటు చేసి ఆరాచకపు రీతిలో వారిపై దాడి చేయటం సంచలనంగా మారటం తెలిసిందే.దీనికి సంబందించిన వీడియోలు విపరీతంగా వైరల్ గా మారాయి. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ప్రేమించిందన్న కారణంతో కాలితో కొట్టటం.. కర్రతో బాదటంతో పాటు.. చెంపలు వాయించేస్తూ రాక్షసంగా వ్యవహరించిన గ్రామపెద్ద లింగప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఉదంతంపై తొలుత పెద్దగా స్పందించని పోలీసులు.. సోషల్ మీడియాలో ఈ అంశం పెను సంచలనంగా మారటం.. మీడియాలో ప్రముఖంగా రావటం.. వివిధ దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో పోలీసులు స్పందించక తప్పని పరిస్థితి చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు గ్రామపెద్ద లింగప్పపై కేసు నమోదు చేయటమే కాదు.. అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. 

బాలికను ప్రేమించిన బాలుడి పైనా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలికను కొట్టే ఉదంతంలో గ్రామ పెద్ద లింగప్పను ప్రోత్సహించిన వారిని.. వీడియోలో వినిపించిన పలువురి మాటల్ని గుర్తించిన పోలీసులు.. ఎవరెవరు అయి ఉంటారన్న అంశంపై విచారిస్తున్నారు. పలువురుపై కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. దాడి జరిగిన బాలిక దళితురాలు కావటంతో.. దళిత సంఘాలన్ని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టాయి.