Begin typing your search above and press return to search.

ఆచితూచి అడుగేసిన తమిళసై.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Jan 2023 9:57 AM GMT
ఆచితూచి అడుగేసిన తమిళసై.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో కేసీఆర్
X
తెలంగాణ ఉద్యమం షురూ చేసింది మొదలు ఇప్పటివరకు ఆయనకు భారీ ఎదురుదెబ్బ అంటూ తగిలింది లేదు. అప్పుడప్పుడు ఎదురయ్యేవన్నీ కూడా చిన్నపాటి దెబ్బలే తప్పించి.. తనకు తాను ఆలోచించుకునే పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. అంతేకాదు.. ఆయన ఎవరితోనైనా పేచి పడిన తర్వాత.. సదరు వ్యక్తికి దెబ్బ పడటమే కానీ కేసీఆర్ కు దెబ్బ పడింది లేదు. అలాంటి కేసీఆర్ రాజకీయ జర్నీలో తొలిసారి రాష్ట్ర గవర్నర్ తమిళ సై చేతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యమ నేత నుంచి ఇప్పటివరకు కేసీఆర్ ప్రయాణాన్నిజాగ్రత్తగా పరికిస్తే ఒక విషయం అర్థమవుతుంది.

తనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయన్నంతనే కామ్ గా ఉండటం.. తనకు ఏ మాత్రం అవకాశం లభించినా ప్రత్యర్థుల చేత మూడు చెరువులు నీళ్లు తాగించే అలవాటు ఆయన సొంతం. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్న మోడీషాలు.. తమను ఉద్దేశించి అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ తీవ్రస్వరంతో విమర్శలు చేస్తున్నా.. తొందరపడకపోవటానికి కారణం కేసీఆర్ చాణుక్యం మీద ఉన్న అంచనాలే. తొందరపడి ముందుకెళితే దెబ్బ తగులుతుందన్న విషయాన్ని గుర్తించిన మోడీషాల.. కేసీఆర్ విషయంలో మిగిలిన వారి మాదిరి ముఖాముఖి పోరు కంటే కూడా వ్యూహాత్మక పోరుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెబుతారు.

తాజాగా గవర్నర్ తమిళ సై విషయంలోనూ మోడీషాలు ఇద్దరు ఆచితూచి వ్యవహరించాలన్న హితవును ప్రత్యేకంగా చెప్పి ఉంటారు. కేసీఆర్ అంత.. కేసీఆర్ ఇంత.. ఆయనతో ఎవరు పెట్టుకున్నా అంతే సంగతులు లాంటివి తరచూ వినిపించేవే. ఈ కారణంతోనే కావొచ్చు. ఆయనపై పోరుకు సిద్ధమైన తమిళ సై వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారే తప్పించి.. అడ్డ బ్యాటింగ్ ను ఆమె నమ్ముకోలేదని చెప్పాలి. తాను గవర్నర్ హోదాలో ఉన్న నేపథ్యంలో.. మిగిలిన వారి మాదిరి దేనికి పడితే దానికి పేచీలు పడటం కాకుండా.. ఒక పద్దతి ప్రకారం కేసీఆర్ సర్కారు తీరును తప్పు పట్టారని చెప్పాలి.

ఈ క్రమంలో ఆమెకు ఎదురుదెబ్బలు తగిలినా మౌనంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో తన బాధను ఆవేదన రూపంలో వెల్లడించారే తప్పించి.. ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. అందరి నుంచి సహానుభూతిని పొందేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలోనూ కేసీఆర్ తనకు తోచినట్లుగా.. ఆవేశపూరితంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలిగేలాచేశారు. తన మీద అధిక్యతను ప్రదర్శించేందుకు వ్యవహరించిన ప్రతిసారీ తగ్గినట్లుగా ఉంటూ.. వ్యూహాత్మక ఎత్తుగడతో తాజా పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. గత ఏడాది తనను బడ్జెట్ ప్రసంగానికి ఆహ్వానించకపోయినా.. మౌనంగా ఉంటూ.. గురి చూసి కాల్చిన చందంగా.. సమయం చూసి మరీ గురి పెట్టి కాల్చేశారు.

వీలైనంత తగ్గినట్లుగా కనిపిస్తూనే.. కేసీఆర్ తీరుపై ఒక కేసు పుటప్ చేసినట్లుగా.. ఎప్పటికప్పుడు తన విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరించే అంశాల్ని ప్రస్తావించటం కనిపిస్తుంటుంది. ఇక.. కేసీఆర్ విషయానికి వస్తే.. గవర్నర్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారన్న విమర్శ వినిపిస్తోంది. గవర్నర్ ను ఇరుకున పడేయటం తన లాటి రాజకీయ నాయకుడికి చిటికెన వేలితో సమానమన్నట్లుగా బావించటం జరిగిన పెద్ద తప్పుగా చెప్పాలి. అదే ఆయన్ను ఈ రోజు కోర్టు ముందు వెనక్కి తగ్గేలా చేసింది. అంతే కాదు.. గవర్నర్ ప్రసంగం లేకుండా ఉండాలని భావించిన గులాబీ బాస్ కు.. గవర్నర్ ప్రసంగం ఉంటుందని ఉత్సాహానికి పోయారే. ఈ క్రమంలో సరైన కసరత్తు లేకపోవటం ఆయనకు తాజా పరిస్థితి ఎదురైందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.