Begin typing your search above and press return to search.

ఏ మాటకు ఆ మాటే.. ఫాంహౌస్ హోంవర్కు మామూలుగా ఉండదుగా సారూ?

By:  Tupaki Desk   |   25 Jan 2021 7:40 AM GMT
ఏ మాటకు ఆ మాటే.. ఫాంహౌస్ హోంవర్కు మామూలుగా ఉండదుగా సారూ?
X
విషయం ఏదైనా కావొచ్చు.. దాని లోతుల్లోకి వెళ్లే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాటి మరెవరూ రాలేరని చెప్పాలి. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా తరచూ రివ్యూ సమావేశాల్ని నిర్వహించని ఆయన.. మీటింగ్ పెడితే మాత్రం.. అధికారుల రెండుచేతులకు భారీగా పని కల్పిస్తారని చెప్పాలి. తాజాగా ఆయన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన మార్కెటింగ్ విధానంపై తనకున్న విజన్ ను చెప్పుకొచ్చారు. ఏకంగా ఎనిమిది గంటల పాటు సాగిన రివ్యూను చూస్తే.. కంటెంట్ ఎంతో ఉంటే తప్పించి.. ఇన్ని గంటల పాటు బోర్ కొట్టకుండా సమావేశాన్ని నిర్వహించటం సాధ్యం కాదని చెప్పాలి.

వ్యవసాయ- మార్కెటింగ్ శాఖాధికారులతోసమీక్షలో కేసీఆర్ విజన్ చూస్తే.. ఆయన రోజుల తరబడి ఫాంహౌస్ లో చేసే కసరత్తు ఎంత పక్కాగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. ప్రగతిభవన్ కంటే ఫాంహౌస్ లో ఎక్కువ కాలం గడుపుతారన్న విమర్శను తరచూ ఎదుర్కొనే తెలంగాణ సీఎం.. కొన్ని రివ్యూల సందర్భంగా ఆయన చెప్పే మాటలు.. విషయాల పట్ల ఆయనకు ఉండే పట్టును చూసినప్పుడు మాత్రం.. ఎంత పక్కాగా కసరత్తు చేస్తారన్న భావన కలుగక మానదు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల అమలు దేశంలో మరెలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

రైతులు పండించిన పంటల్ని మార్కెట్లో అమ్ముకునేలా సరైన విధానాల్ని అమలు చేయాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్న ఆయన.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల అమలు విషయంపై రాష్ట్రం ఏ తీరులో రియాక్టు కావాలన్న విషయాన్ని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం మార్కెటింగ్ వ్యవస్థను సజీవంగా ఉంచటమే కాదు..మరింత బలోపేతం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

రాష్ట్రంలో పెరిగిన సాగు లెక్కల్ని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారని.. ఇప్పుడు 1.10కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలని.. పంట మార్పిడి విధానం రావాలని.. అప్పుడు మాత్రమే ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయన్నారు. గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉన్నందున.. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు. 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికల్ని వెంటనే వినియోగంలోకి తేవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ అధికారులకు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేశారనే విషయంపై తనకు పది రోజుల్లోపు సరైన లెక్కలు తీసి అందించాలని ఆదేశించారు.