Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు ఎర వేస్తున్న కేసీఆర్.. పడుతారా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 12:00 PM GMT
ఉద్యోగులకు ఎర వేస్తున్న కేసీఆర్.. పడుతారా?
X
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ వివిధ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారే ఉద్యోగులను మచ్చిక చేసుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగులో ఉన్న వారి సమస్యలను ఆగమేఘాల మీద పరిష్కరించేలా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లకు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం ఆ తరువాత డీఏను ప్రకటించింది. ఇప్పుడు వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ఉద్యోగులను పట్టించుకోలేదు. పైగా వారికి భారీగా జీతాలునన్నాయంటూ ఆ సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడారు. ఇప్పుడు వారి సమస్యలపై దృష్టిపెట్టడం ద్వారా ఉద్యోగులు కేసీఆర్ ను నమ్ముతారా..? అనే చర్చ సాగుతోంది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగుపడుతాయని అనుకున్న వారిలో ముందుగా ఉద్యోగుల గురించి చెప్పొచ్చు. ఎందుకంటే చాలా విభాగాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది ఏకరువు పెట్టారు. దీంతో కేసీఆర్ మొదలుపెట్టిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు పలికారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి మరీ కేసీఆర్ వెంట నడిచారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కొందరు ఉన్నతోద్యోగులకు న్యాయం జరిగిందనే చెప్పొచ్చు.

కానీ ఏన్నో ఏళ్లుగా వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారి పరిస్థితి అలాగే ఉంది. 2014 లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత పీఆర్సీ ప్రకటిస్తానని చెప్పిన కేసీఆర్ ఆ విషయాన్ని మరిచిపోయారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సందర్భంగా మరోసారి ఆ విషయాన్ని రేజ్ చేయడంతో ఉద్యోగులు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. ఆ తరువాత అనుకున్న విధంగానే పీఆర్సీ ప్రకటించినా.. ఉద్యోగులు సంతృప్తి పడలేదు.

ఇక ప్రతీ సంవత్సరం చేపట్టాల్సిన బదిలీలను ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటికి తోడు కొత్త జోన్ల ప్రకారం ఉద్యోగులను విభజించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు స్పౌజ్ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని పిల్లా పాపలతో ఆందోళన చేస్తున్నా కనికరించలేదు. అటు ఉద్యోగ సంఘాల నాయకులు సైతం కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఉద్యోగుల సమస్యలు మాత్రం తీరడం లేదు.

ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తామని 2018 ఎన్నికల సందర్భంగా చెప్పారు. కానీ నాలుగేళ్లు గడిచినా ఆ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఎవరూ అడగకపోయినా హెల్త్ కార్డుల జారీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే పెద్ద కారణమే ఉంది. త్వరలో ఉద్యోగ, ఉపాధ్యాల ఎమ్మెల్సీలు జరగనున్నాయి. అందుకే వారిని మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. అయితే తాత్కాలికంగా వారిని ఆకట్టుకోవడానికి మెరుపులు చూపిస్తున్న కేసీఆర్ ను ఉద్యోగులు నమ్ముతారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్యోగుల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.