Begin typing your search above and press return to search.

ప‌ది ప‌రీక్ష‌ల ర‌ద్దుకే కేసీఆర్ మొగ్గు: ఉత్కంఠ‌లో విద్యార్థులు

By:  Tupaki Desk   |   7 Jun 2020 7:44 AM GMT
ప‌ది ప‌రీక్ష‌ల ర‌ద్దుకే కేసీఆర్ మొగ్గు: ఉత్కంఠ‌లో విద్యార్థులు
X
వైర‌స్ వ్యాప్తితో అక‌స్మాత్తుగా ప‌డిన ఉత్పాతంతో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అనంత‌రం ప‌రిస్థితి అదుపులోకి రాకున్నా ఇక ఆ వైర‌స్‌తో స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌క ఏర్ప‌డ‌డంతో ఇక ఎలాగోలా పదో తరగతి పరీక్షలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం సిద్ధమ‌వ‌గా హైకోర్టు ప్ర‌వేశించి కీల‌క తీర్పు ఇచ్చింది. వైర‌స్ తీవ్రంగా ఉన్న జీహెచ్ ఎంసీ - రంగారెడ్డి జిల్లాల‌ను వ‌దిలేసి రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని సూచించింది. అయితే ఆ నిర్ణ‌యం స‌రికాద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం భావిస్తోంది. ఆ విధంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే కొంద‌రికి అన్యాయమ‌వుతుంద‌ని భావించి ఇప్పుడు ఏకంగా ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌ల ర‌ద్దుకు ప్ర‌భుత్వం మొగ్గు చూపుతోంది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదివారం సంబంధిత అధికారుల‌తో స‌మావేశం కానున్నారు. రాత్రి వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించేలా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. అదే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు పూర్తిగా రద్దు చేయ‌డం. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల ఆధారంగా విద్యార్థుల‌ను అప్‌గ్రేడ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంద‌ని స‌మాచారం. విధిలేని పరిస్థితిల్లో ఈ నిర్ణ‌యానికి మొగ్గు చూపేలా ఉంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రీ ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఆధారంగా వారికి గ్రేడ్లు ఇచ్చే అవకాశం అధికంగా ఉంది. ఇదే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. సాధారణంగా విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్ ప‌రీక్ష‌లు ఏడాదిలో నాలుగు నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించే అవకాశం ఉంది.

అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు కొన్ని స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు. సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌-1లో వచ్చిన మార్కులు ఆధారంగా చేసుకొని గ్రేడ్లు ఇవ్వాల‌ని కొందరు సూచిస్తున్నారు. ఈ మార్కులను ఆయా పాఠశాలల నుంచి తెప్పించుకొని ఫలితాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే ఆ పరీక్షలకు గైర్హాజరైన వారికి అన్యాయం జ‌రిగేలా ఉంద‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న జీహెచ్ ఎంసీ - రంగారెడ్డి పరిధిలో వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా వారికి సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అయితే, సప్లిమెంటరీ రాసిన విద్యార్థులను రెగ్యులర్‌గానే పరిగణించాలని తెలిపింది.

హైకోర్టు నిర్ణ‌యం త‌ర్వాత ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు చేసింది. ఆ తర్వాత హైకోర్టు తీర్పును అనుసరించి పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్ర‌మంలోనే పదో తరగతి పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి అధ్య‌క్ష‌త‌న సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

కొందరికి పరీక్షలు నిర్వహించడం, మరికొందరికి తర్వాత పరీక్షలు పెట్టడం అంటే విద్యార్థులకు అన్యాయం జ‌రిగే అవ‌కాశం ఉంది. పరీక్షలు రాయలేని విద్యార్థులు ఆందోళ‌న చెందే అవ‌కాశం ఉంది. వీటన్నింటిని నేప‌థ్యంలో మొత్తానికి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల ఆధారంగా అప్‌ గ్రేడ్ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ విష‌య‌మై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకోనున్నారు. ఆదివారం రాత్రి వ‌ర‌కు వీటిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. వాస్త‌వంగా సోమ‌వారం నుంచి వాయిదా ప‌డిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి. ఇప్పుడు ఆ ప‌రీక్ష‌ల‌పై నీలి మేఘాలు అలుముకున్నాయి.