భూ సమస్యల వెల్లువ.. ధరణిని రద్దు చేసే దిశగా కేసీఆర్

Tue Jan 24 2023 10:14:44 GMT+0530 (India Standard Time)

KCR towards cancellation of Dharani

తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ కంప్యూటరీకరణ చేసేందుకు ప్రవేశపెట్టిన 'ధరణి' వెబ్ సైట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు తమకు జరిగిన తప్పులపై కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. గతంలో కంటే ధరణి వచ్చిన తరవాతే భూ వివాదాలు పెరిగాయని కొందరు వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సైతం దీనిని ఆసరాగా చేసుకొని వచ్చే  ఎన్నికల్లో ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని హామీ ఇస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరణి పోర్టల్ ను ఏం చేద్దాం..? అనే ఆలోచనలో పడింది. ఈ మేరకు దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో అధికారులు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం.

2021 అక్టోబర్ 29 న అందుబాటులోకి వచ్చింది. భూ సమస్యల పరిష్కారం కోసం అని ప్రవేశపెట్టిన దీని ద్వారా ఇంకా సమస్యలు పెరిగాయి. కొందరు ధరణిని ఆధారం చేసుకొని భూ ఆక్రమణలకు పాల్పడిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో ధరణిని రద్దు చేయాలని కొందరు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వీరి ఆందోళనకు మద్దతు ఇచ్చాయి. అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటన కూడా చేశారు.  ధరణితో సమస్యలు ఎదుర్కొన్న వారంతా ఈ హామీపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ రద్దు చేస్తామా..? లేక సవరించాలా..? అనేది ఆలోచిస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ధరణిలో ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు.

ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి..? సవరింపులు ఎలా చేయాలి..? అన్నదానిపై సమీక్షించారు. గతంలోని 'మా భూమి' తరహాలో ఉంటేనే మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏతరహా అయితే బెటరో ఆ విధంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో అమల్లోకి వచ్చిన ధరణిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్ ను సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.

అయితే మొత్తంగా ధరణిని పూర్తిగా రద్దు చేసి పాత పద్దతిలోనే రికార్డులు తయారు చేస్తారని అంటున్నారు. ఒకిద్దరు మంత్రులు కూడా దీనికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తే వెనుకడుగు వేసినట్లవుతుందని ఆలోచిస్తున్నారు. కానీ మొత్తంగా ధరణిపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.