Begin typing your search above and press return to search.

వాసాలమర్రి సుడి తిరిగిపోయినట్లే.. వరాల మోత మోగిస్తారట

By:  Tupaki Desk   |   19 Jun 2021 9:30 AM GMT
వాసాలమర్రి సుడి తిరిగిపోయినట్లే.. వరాల మోత మోగిస్తారట
X
కొందరిని చూస్తే మొట్ట బుద్ధవుతుంది…మరికొందరిని చూస్తే పెట్ట బుద్ధి అవుతుందన్న సామెతకు తగ్గట్లే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తే. ఆయనకు ఎప్పుడు ఏమనిపిస్తుందో చెప్పలేని పరిస్థితి. కొందరి మీద అమితమైన ప్రేమాభిమానాలుకురిపించే ఆయన.. మరికొందరి విషయంలో చాలా కటువుగా ఉంటారు. ఏ ముహుర్తాన యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రిని చూశారో కానీ.. దాన్ని చూసినంతనే మనసు పారేసుకున్నారు కేసీఆర్. అక్కడి స్థానికులతో మాట్లాడి.. గ్రామంలోని సమస్యలపై చర్చించేందుకు తన ఫాంహౌస్ రావాలని ఆహ్వానించారు.

కేసీఆర్ నోటి నుంచి మాట వస్తే.. అంతే. దీనికి తగ్గట్లే.. ఫాంహౌస్ కు వచ్చిన గ్రామస్తులతో మాట్లాడి.. రూ.100 కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే అన్ని సమస్యలు తీర్చేస్తానని చెప్పటమే కాదు.. అంకాపూర్ ను తాను ఏ రీతిలో అయితే డెవలప్ చేశానో.. అదే రీతిలో ఆ ఊరు రూపురేఖలు మార్చేస్తానని పేర్కొన్నారు.

ఇదంతా జరిగింది 2020 అక్టోబరు 31. కరోనా మొదటి దశ నుంచి బయటకు వచ్చి.. ఎప్పటిపరిస్థితుల్లోకి వస్తున్న వేళ. తాజాగా ఆయనకు వాసాలమర్రి గుర్తుకు వచ్చింది. అంతే.. వారికి ఫోన్ చేసిన ఆయన ఈ నెల 22న గ్రామానికి వస్తున్నట్లు చెప్పి.. డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడతామని.. అందులో భాగంగా ఊరు మొత్తానికి భోజనం పెట్టిస్తానని.. అదంతా తానే చూస్తానని సర్పంచ్ కు చెప్పటం విశేషం.

విచిత్రమైన విషయం ఏమంటే..వాసాలమర్రిని చూడటానికి కారణమైన జనగామ జిల్లా కొడకండ్లకు పెద్దగా ఒరిగింది లేదు. ఆ ఊళ్లో ఏర్పాటు చేసిన రైతు వేదికను ఓపెన్ చేసి తిరిగి వెళ్లే సమయంలో వాసాలమర్రిని చూడటం.. ఆ గ్రామం మీద కేసీఆర్ కరుణా కటాక్షాలు పడటంతో ఇప్పుడా ఊరు రూపురేఖలు మారబోతున్నాయి. ఇదంతా చదివిన తర్వాత వచ్చే సందేహం ఏమంటే? తెలంగాణలో వాసాలమర్రిలాంటి గ్రామాలు వేలాది ఉంటాయి. మరి.. వాటికి లేని ప్రత్యేకత ఈ ఊరికే ఎందుకు ఇవ్వాలి?

2600 మంది జనాభా ఉన్న ఊరికి రూ.100 కోట్లు ఇవ్వటం ఏమిటి? మిగిలిన ఊళ్లను పట్టించుకోకపోవటం ఏమిటి? కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రే తప్పించి వాసాలమర్రికి మాత్రమే కాదు కదా? గ్రామానికి మేలు చేయొద్దని చెప్పట్లేదు. అయితే.. అద్భుతంగా లేదంటే తీసికట్టుగా ఉండకూడదు. ముఖ్యమంత్రి వారి కరుణ ఉంటే ఏమైనా జరుగుతుందన్న భావన మంచిది కాదు కదా? డెవలప్ మెంట్ అందరికి ఒకేలా ఉండాలే కానీ.. ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువ ఉన్నట్లుగా ఉండకూడదు కదా? మరీ.. విషయాల్ని కేసీఆర్ ఎప్పటికి గుర్తిస్తారో?