`దళిత బంధు` కేసీఆర్కు.. చుక్కలు కనిపిస్తున్నాయా?

Tue Sep 14 2021 14:00:59 GMT+0530 (IST)

KCR has made sensational comments on Dalithbandu

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు `దళిత బంధు` పథకం తాలూకు సెగ తగులుతోందా? ఒక సామాజిక వర్గానికే రూ.10 లక్షల చొప్పున ఇస్తూ.. మిగిలిన వర్గాలను పక్కన పెడుతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవు తోందని గమనిస్తున్నారా? అంటే.. తాజాగా ఆయన చేసిన కామెంట్లను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకు లు. దళిత బంధు పథకాన్ని ఇటీవల ప్రకటించిన కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దీనిని ఈ నియోజకవర్గానికే పరిమితం చేసిన విషయం తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తున్నామని ఆయన చెబుతున్నారు.అయితే.. దీనిపై విమర్శలు రావడంతో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రిలో తొలివిడత ఈ పథకాన్ని ఆయన అమలు చేశారు. అయితే.. కొన్ని కారణాలతో కలెక్టర్ల నుంచిఅనుమతి ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ నిధులు ఇస్తామని ప్రకటించి.. ప్రస్తుతానికి దీనిని కూడా నిలుపుదల చేశారు. అయితే.. విపక్షాలు చేసిన ప్రచారం కావొచ్చు.. లేదా.. ప్రజల్లో పెరిగిన అవగాహన కావొచ్చు.. ఎస్సీ వర్గాలకు మాత్రమే దళిత బంధు పేరిట రూ.10 లక్షలు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. తమకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు కేసీఆర్ త్రిశంకు స్వర్గంలో చిక్కుకున్నట్టయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన అనునయ వాక్యాలు చెబుతున్నారు. దళితుల ఆర్థిక అవసరాల లక్ష్యంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేసిన ఆయన.. ఆర్థిక సామాజిక వివక్షను బద్దలు కొట్టాలనే ఆశయంతో దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే కేవలం దళితులే కాదు.. ఇతర కులాల్లోని పేదలకు కూడా రూ. 10 లక్షల సహాయం అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. వరుస క్రమంలో అందరికీ దళిత బంధు లాంటి పథకం తీసుకొస్తామన్నారు.

దళితబంధు పథకం అమలు విషయంలో మిగతా వర్గాలు సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్లో దళితబంధు పథకం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామన్న ఆయన.. సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పోతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రైతు బంధు సహా ఇతర పథకాలు అమలు చేసినప్పుడు దళితులెవరూ అభ్యంతరం చెప్పలేదని.. కాకపోతే తమకు కూడా మేలు చేయాలని మాత్రమే దళితజాతి ప్రజలు కోరుకున్నారని తెలిపారు. ఇప్పుడు దళితబంధు పథకం అమలు విషయంలో కూడా మిగతా వర్గాలు అదే స్థాయిలో సహకరించాలి కోరారు. సో.. దీనిని బట్టి దళిత బంధు తాలూకు సెగ బాగానే తగులుతున్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.