ప్రగతిభవన్ లో గులాబీ నేతలకు సర్ ప్రైజ్ చేసిన కేసీఆర్

Tue Feb 23 2021 11:00:01 GMT+0530 (IST)

KCR praises Trs leaders in Pragati Bhavan

టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పని గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అన్నింటికి మించి హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సోమవారం ప్రగతిభవన్ లో సర్ ప్రైజ్ ఎదురైందని చెబుతున్నారు. మూడ్ బాగున్న వేళలో కేసీఆర్ వ్యవహరించిన తీరు అందరిని ఆకర్షించటమే కాదు.. సారు అనుకుంటే ఇలానే ఉంటుందన్న మాట పలువురి నోట వినిపించటం గమనార్హం. ఎప్పుడూ షాకులు ఇచ్చే కేసీఆర్ సారు.. ఈసారి సర్ ప్రైజ్ ఇవ్వటం ఏమిటి? ఎలాంటి సర్ ప్రైజ్ గులాబీ నేతలకు ఎదురైంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చేస్తాయి.హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎంత ట్రై చేసినా గులాబీ ఖాతాలో పడదు. ఆ మాటకు వస్తే.. ఆ స్థానం నుంచి పోటీ చేయాలంటే టీఆర్ఎస్ నేతలే భయపడతారు. ప్రతి సందర్భంలోనే చేదు అనుభవమే తప్పించి.. మరొకటి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న ధర్మసంకటం పార్టీ అధినేతే కాదు.. పార్టీ వర్గాలు సైతం భారీగా కసరత్తు చేశారు. చివరకు అనూహ్యంగా దివంగత మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆదివారం ఉదయానికి డిసైడ్ అయిన సారు.. పీవీ కుమార్తెను ఒప్పించటానికి భారీగా కసరత్తు చేశారు. ఏమాత్రం ఆలోచించుకోవటానికి అవకాశం ఇవ్వని సారు.. తన కుమారుడు కేటీఆర్ నురంగంలోకి దింపి.. కేకే మాట సాయంతో ఇష్యూను క్లోజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పటివరకు పార్టీకి సంబంధం లేని అభ్యర్థిని బరిలోకి దించిన నేపథ్యంలో.. ఎన్నిక  జరుగుతున్న మూడు జిల్లాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధుల్ని ప్రత్యేకంగా ప్రగతిభవన్ కు బ్రేక్ ఫాస్టుకు పిలిపించిన కేసీఆర్.

అనంతరం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన పీవీ కుమార్తెను జిల్లాల వారీగా నేతలకు పరిచయం చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. సారు మూడ్ ఇంతలా ఉండటం అరుదుగా పలువురు చెబుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి కోసం సారు చేసిన ఏర్పాట్లు ఆసక్తికర చర్చకు తెర తీశాయి. ఏమైనా.. ఒక అభ్యర్థి కోసం కేసీఆర్ ఇంత సమయాన్ని వెచ్చించటం.. పార్టీ నేతల్ని దగ్గరుండి మరి పరిచయం చేయటం లాంటివి విశేషాలతో సర్ ప్రైజ్ చేశారు. ఇలాంటివి గతంలో చూడలేదన్న మాట పలువురు టీఆర్ఎస్ నేతల నోటి నుంచి రావటం గమనార్హం.