Begin typing your search above and press return to search.

ఏపీలో అతి పెద్ద చర్చకు తెర తీసిన కేసీయార్

By:  Tupaki Desk   |   4 Oct 2022 8:16 AM GMT
ఏపీలో అతి పెద్ద చర్చకు తెర తీసిన కేసీయార్
X
కేసీయార్ సామన్యుడు కారు, తిమ్మిని బమ్మిగా చేస్తారు. లేని దాన్ని కూడా ఉన్నదిగా చూపిస్తారు. ఇపుడు ఆయన జాతీయ రాజకీయ పార్టీ అంటూ కొత్త ఎత్తుగడకు తెర తీశారు. దాంతో తెలంగాణాతో పాటు ఏపీలోనూ కేసీయార్ ఒక పెద్ద చర్చకు వేదికను సిద్ధం చేశారు. ఏపీలో కేసీయార్ పార్టీకి ఉన్న స్కోప్ ఎంత, బలమెంత, ఎవరెవరు కేసీయార్ పార్టీ వైపు అట్రాక్ట్ అవుతారు అన్నది ఇపుడు అన్ని రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజలలో కూడా వాడి వేడిగా చర్చ సాగుతోంది.

ఇదిలా ఉంటే కేసీయార్ తెలుగుదేశం పార్టీలో పనిచేయడం, అలాగే ఆయన పూర్వీకులు ఉత్తరాంధ్రా వారు కావడంతో పాటు బలమైన సామాజికవర్గానికి కేసీయార్ చెందిన వారు కావడం వంటి ప్లస్ పాయింట్లు ఆయన కొత్తగా పెట్టబోయే జాతీయ పార్టీకి ఏ మేరకు ఉపయోపడతాయి అన్నది చర్చగా ఉంది. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అధికార వైసీపీ కిక్కిరిసిపోయి ఉంది. అందులో లెక్కకు మిక్కిలిగా నేతలు ఉన్నారు.

అయితే అధికార పార్టీలో తమకు సరైన అవకాశాలు దక్కపోతే చాలా మంది కచ్చితంగా ఇతర పార్టీల వైపు చూస్తారు. ఆ విధంగా చూస్తే వైసీపీ నుంచి ఏమైనా జంపింగ్స్ కేసీయార్ జాతీయ పార్టీ వైపుగా సాగుతాయా అన్నది కూడా బిగ్ డిబేట్ గా ఉంది. అదే విధంగా చూస్తే టీడీపీ విపక్షంలో ఉంది. ఆ పార్టీలో కూడా చంద్రబాబు పార్టీ నేతల పనితీరుని అంచనా వేసి టికెట్లు ఇస్తామని చెబుతున్నారు.

అలా టికెట్లు రాకపోయినా లేక రేపటి రోజున పొత్తులలో భాగంగా టికెట్లు రావు అనుకున్న వారు కేసీయార్ పార్టీ వైపు వెళ్తారా అన్న చర్చ కూడా ఉంది. జనసేనలో ఉన్న వారు కూడా డబ్బున్న పార్టీగా కేసీయార్ జాతీయ పార్టీ దూసుకుని వస్తే వెళ్ళడానికి రెడీ అవుతారా అన్నది కూడా ఒక చర్చ. ఇక ఏ పార్టీలోనూ చేరడానికి ఇష్టం లేని నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ లో అలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారంతా తమ సొంత పార్టీ కాంగ్రెస్ ఎదుగుతుంది అన్న నమ్మకం లేకున్నా మరో దారి లేకుండా ఉన్నారు. అలాంటి వారు కేసీయార్ కొత్తగా జాతీయ పార్టీ పెడితే చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

దీంతో కేసీయార్ కొత్త పార్టీ మీద చాలా రకాలుగానే విశ్లేషణలు అయితే ఉన్నాయి. కొత్త ఎపుడూ మోజుగానే ఉంటుంది. దానితో పాటు ఏపీ రెండుగా విడిపోయినా తెలంగాణాలో టీయారెస్ ఉన్నా హైదరాబాద్ ని వీడని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఏపీ నుంచి వ్యాపారాల మీద ఉన్న వారు కూడా అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. వారంతా కేసీయార్ పార్టీలో చేరడం ద్వారా తమకు ఎలాంటి వ్యాపార ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు అని చూస్తున్నారు.

మరికొందరైతే టీయారెస్ అత్యంత ధనిక పార్టీ ఆ పార్టీలో చేరితే తమ రాజకీయ సరదా తీరుతుంది. అదే టైం లో తమకు లక్ కలసి వస్తే పదవులు ఏమైనా దక్కుతాయని కూడా ఊహిస్తున్నారు. మొత్తానికి కేసీయార్ పార్టీ పెడితే చేరడానికి ఎక్కువగా అవుట్ డేటెడ్ లీడర్స్, అలాగే వివిధ పార్టీలో నో చాన్స్ అనిపించుకుంటున్న వారే ఉన్నారని అంటున్నారు. వీరితో కేసీయార్ బండి ఏపీలో ఎలా నడుస్తుందో తెలియదు కానీ కేసీయార్ పార్టీకి ఏపీలో కావల్సినత చర్చ గుర్తింపు దక్కించేందుకు వీరు ఉపయోగపడతారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.