Begin typing your search above and press return to search.

జగన్ మీద అంత కోపమా : ఏపీ మీద కేసీయార్ ఫుల్ ఫోకస్...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 AM GMT
జగన్ మీద అంత కోపమా : ఏపీ మీద కేసీయార్ ఫుల్ ఫోకస్...?
X
రాజకీయ చాణక్యుడు అని పేరు తెచ్చుకున్న కేసీయార్ ఇపుడు మోడీతో పాటు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేత మరొకరు ఉన్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయనే ఏపీ సీఎం వైఎస్ జగన్ అని అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న వారిలో కేసీయార్ ఒకరు. జగన్ తోడుగా ఉంటే ఢిల్లీని చుట్టి రావచ్చునని, జాతీయంగా వెలిగిపోవచ్చునని కేసీయార్ కలలు కన్నారు. ఇక జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే కేసీయార్ ముఖ్య అతిధిగా వచ్చారు.

ఆ తరువాత కూడా కొన్నాళ్ళ పాటు ఇద్దరి మధ్యన చక్కని స్నేహం సాగింది. కారణాలు తెలియవు కానీ ఇపుడు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు ఇద్దరూ. ఈ ఇద్దరి స్నేహం బంధానికి ప్రధాన అడ్డంకి మోడీ బీజేపీ అని చెబుతున్నారు. జగన్ మోడీతోనే నా రాజకీయం అంటున్నారు. మోడీని ఎదిరిస్తున్నారు కేసీయార్. ఇక ఏపీలో చూస్తే జగన్ కేంద్రాన్ని దేనికీ ఎదిరించడంలేదు. ఆఖరుకు ప్రత్యేక హోదా వంటి వాటి మీద కూడా మాట్లాడం లేదు అని విపక్షాలే కాదు మేధావులు సగటు జనాలు అంటున్నాయి.

తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా ఏపీకి సంబంధించి కొన్ని డిమాండ్లు పెట్టి బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇస్తే బాగుండేది అన్న భావన అంతటా ఉంది. అయితే అవుట్ రేట్ గా వైసీపీ మద్దతు ఇచ్చేసింది. దాంతో ఏపీలో బీజేపీ మీద కోపం ఉన్న జనాలకు జగన్ మీద కోపం వస్తోంది అంటున్నారు. ఇక ఏపీకి ఎనిమిదేళ్లలో కేంద్రం చేసినది ఏమీ లేదని అంటున్నారు. పోలవరం అలాగే ఉంది. రాజధాని ఊసు లేదు, ఇక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. విభజన హామీలకు దిక్కులేదు.

ఈ విషయం ప్రశ్నించడానికి ఏపీలోని విపక్షాలు గట్టిగా ముందుకు రావడం లేదు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి జగన్ తాను బీజేపీ పక్షం అని మరోమారు చాటేసుకున్నారు. ఇలా రాజకీయంగా చూస్తే జనాలకు బీజేపీ మీద కోపం ఉంది కానీ ఫోకస్ చేసే వారే లేరు అంటున్నారు. ఇపుడు ఆ లోటు తీరుస్తూ కేసీయార్ భారత్ రాష్ట్ర సమితి ఏపీలో ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఏపీలో మొత్తానికి మొత్తం సీట్లకు పోటీ పెట్టాలని కూడా కేసీయార్ సీరియస్ గా ఆలోచిస్తున్నారుట.

తాము తెలంగాణాను కోరుకున్నాం కానీ ఏపీకి అన్యాయం చేయమని కోరలేదని చెబుతూ ఏపీ జనాల మనసు గెలుచుకునేందుకు కేసీయార్ బీయారెస్ తరఫున ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా తమ పార్టీకి ఓటేస్తే బీజేపీని ఎదిరించడమే కాదు, ప్రత్యేక హోదా లాంటి వాటిని ఏపీకి సాధించుకుని తీరుతామని జనాలకు చెప్పనున్నారుట. అలాగే కేంద్రాన్ని ఎదిరించలేని జగన్ మీద కూడా బీయారెస్ బాణాలు వదిలే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి జగన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో వేసిన స్టెప్ తో కేసీయార్ ఇక మొహమాటాలకు తావు లేదు, ఏపీలో ఎంట్రీ ఇవ్వాల్సిందే అని పక్కాగా డిసైడ్ అయిపోయారు అంటున్నారు. మరి ఉమ్మడి ఏపీని విడగొట్టారు అన్న కోపంతో కాంగ్రెస్ ని దూరం పెట్టిన ఏపీ జనాలు దానికి కారకుడు అయిన కేసీయార్ ని ఆదరిస్తారా చూడాలి. ఇక జగన్ మీద కేసీయార్ యుద్ధం ప్రకటిస్తే ఏపీలోని విపక్షాలు కూడా ఆయనతో చేతులు కలుపుతాయా అన్నది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ.

ఇప్పటికి ఎలా ఉన్నా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ టీడీపీ జనసేన బీజేపీ విషయంలో సీరియస్ గానే ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అలా అంతా కలసి బీజేపీని దానితో పాటు జగన్ని కూడా పొలిటికల్ గా ఫోకస్ చేసి జనంలో దోషులుగా నిలబెడితే మాత్రం రాజకీయం రసకందాయంలో పడుతుంది అనడంలో సందేహమే లేదు.