Begin typing your search above and press return to search.

కేసీఆర్ 'పల్లెకు పోదాం'.. కానీ పైసలివ్వం..

By:  Tupaki Desk   |   10 Aug 2018 4:26 AM GMT
కేసీఆర్ పల్లెకు పోదాం.. కానీ పైసలివ్వం..
X
సీఎం కేసీఆర్ తాజాగా గ్రామాలపై దండయాత్ర మొదలుపెట్టారు. మూడు నెలల్లో క్లీన్ స్వీప్ చేస్తానంటున్నారు. పంద్రాగస్టు నుంచి పరిశుభ్రమైన గ్రామాలను తయారు చేస్తానంటున్నారు. గుంతలు పూడ్చి - శిథిలాలు తొలగించి.. శ్మశనా వాటిక ధోబీ ఘాట్ నిర్మాణం చేసి సకల సదుపాయాలు కల్పిస్తానన్నారు. అంతా బాగానే ఉంది. కానీ పంచాయతీ కార్మికులు గడిచిన నెల రోజులుగా వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. కలెక్టర్లను ముట్టడిస్తున్నారు. మంత్రుల ఇళ్ల ముందు బైటాయిస్తున్నారు.. అయినా కానీ ఈ సంపన్న తెలంగాణ రాష్ట్ర సేనాని స్పందించడం లేదు.. ఇప్పుడొచ్చి సడన్ గా గ్రామాలను పరిశుభ్రం చేస్తాననడంతో పంచాయతీ కార్మికుల్లో అసహనం పెంచుతోంది.

తెలంగాణ సంపన్న రాష్ట్రమని కేసీఆరే అన్నారు. ఉద్యోగులకు - కాంట్రాక్టు కార్మికులకు పోలీసులకు ఇబ్బడిముబ్బడిగా జీతాలు పెంచేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులు - సాక్షర భారత్ లాంటి ఉద్యోగుల విషయంలో సీఎం కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారు. వారి గోడును కనీసం ఆలపించుకోవడం లేదు..

పల్లెలకు పరిశుభ్రంగా చేస్తానని ప్రకటిస్తున్న కేసీఆర్ ఆ పల్లెలను నీట్ గా ఉంచే పంచాయతీ కార్మికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయం.. అసలు శుభ్రం చేసేదే వారు.. వారు లేకుండా ఎలా పరిశుభ్రం చేస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న..

పంచాయతీ కార్మికుల నెల రోజుల సమ్మెతో తెలంగాణలో గ్రామాలు కంపుకొడుతున్నాయి. ఈగలు - దోమలు వృద్ధి చెంది రోగాలు వ్యాపించి ఊళ్లకు ఉళ్లు జ్వరాలతో సతమతమవుతున్నాయి. ఎంతోమందికి జీతాలు పెంచి లబ్ధి చేకూర్చిన కేసీఆర్ పంచాయతీ కార్మికులు నెల రోజులుగా నెత్తినోరు కొట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాలన్నీ పారిశుధ్య లోపంతో రోగాలు ప్రబలుతున్నా కానీ స్పందించడం లేదు. పైగా ఇప్పుడు గ్రామాలన్నీ శుభ్రం చేస్తానంటున్నారు. పంచాయతీ కార్మికుల తోడు లేకుండా ఎలా శుభ్రం చేస్తాడన్నది అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న..