ఉప ఎన్నిక మహత్యం.. సస్పెండ్ చేసినోడ్ని సాదరంగా చేర్చుకున్న కేసీఆర్

Sun Aug 14 2022 13:09:50 GMT+0530 (IST)

KCR on Munugodu Constituency Issue

మునుగోడు ఉప ఎన్నిక.. మిగిలిన ఉప ఎన్నిక మాదిరే అని.. దానికంటూ ప్రత్యేకత ఏమీ లేదంటూ చెప్పిన టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మాటకలు.. చేతలకు మధ్య బోలెడంత అంతరం ఉందన్న విషయం ఇటీవల  చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఈ ఉప ఎన్నిక కోసం గంటల తరబడి వెచ్చిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా.. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇలాంటి వేళ.. విజయానికి అవసరమైన వారిని గుర్తుకు తెచ్చుకొని మరీ వారిని అక్కున చేర్చుకుంటున్నారు.గతంలో తాను ఆగ్రహించి.. వేటు వేసిన నేతలు సైతం కేసీఆర్ కు చప్పున గుర్తుకు వస్తున్నారు. తాజాగా అలా గుర్తుకు వచ్చిన ఒక నేత వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సీనియర్ నేత వేనేపల్లి వెంకటేశ్వరరావు అనే నాయకుడు ఉన్నారు. స్థానికంగా మంచి పట్టున్న ఆయన మొదట్నించి తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. అయితే.. ఉద్యమం ఉధ్రతంగా సాగుతున్న వేళ.. సైకిల్ దిగేసిన ఆయన గులాబీ కారు ఎక్కేశారు.

అప్పటి నుంచి పార్టీ కోసం తీవ్రంగా పని చేసేవారు. 204లో మునుగోడు బరిలో దిగిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయంలో కీలక పాత్ పోషించారు. కాకుంటే.. 2018 వచ్చేసరికి మాత్రం మునుగోడు టికెట్ తనకు కన్ఫర్మ్ చేయాలన్న ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే.. ఆయనకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు కేసీఆర్. 2018లోనూ మునుగోడు పార్టీ టికెట్ ను కూసుకుంట్లకే కేటాయించటంతో అతను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. ఒళ్లు మండిన వేనేపల్లి భారీ బహిరంగ సభను నిర్వహించి తన బలాన్ని చాటారు.

పార్టీ నిర్ణయానికి.. అందునా తాను డిసైడ్ అయిన తర్వాత కూడా  భారీ సభను ఏర్పాటు చేయటమా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేసీఆర్.. పార్టీ లైన్ కు భిన్నంగా సభ పెడతారా? అంటూ సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వేనేపల్లికి ప్రగతిభవన్ నుంచి పిలుపు వచ్చింది.

దీంతో ప్రగతిభవన్ కు వెళ్లిన ఆయనతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆయన్ను తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా ప్రకటించారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న రీతిలో.. గతంలో ఆయన మీద విధించిన సస్పెన్షన్ ను ఎత్తేయటమే కాదు.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామన్నారు.

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి ప్రయత్నం చేయాలంటూ సరికొత్తగా వ్యవహరించిన తీరుకు వేనేపల్లి వెంకటేశ్వరరావు ఫుల్ ఖుషీ అయినట్లుగా చెబుతున్నారు. సస్పెండ్ చేసిన చోటా నేతను సైతం ప్రగతి భవన్ కు పిలిపించుకొని ఆయనకు పెద్దపీట వేసే తీరు చూస్తే.. మునుగోడకు కేసీఆర్ ఇచ్చే ప్రాధాన్యత ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.