Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు.. ఎమ్మెల్యేలు మున్సిపల్ రాజకీయాలు

By:  Tupaki Desk   |   6 Feb 2023 7:00 PM GMT
కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు.. ఎమ్మెల్యేలు మున్సిపల్ రాజకీయాలు
X
నేషనల్ లెవల్లో చక్రం తిప్పడానికి తయారవుతున్న కేసీఆర్‌కు లోకల్ లెవల్లో కష్టాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీగా అవతరించి ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించేందుకు తిరుగుతున్న కేసీఆర్‌కు ఇప్పుడు స్థానిక సంస్థల లొల్లి కలవరపరుస్తోంది. ఈ లొల్లికి ఎమ్మెల్యేలే సగం కారణమని తెలిసీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెయిట్ అండ్ సీ గేమ్ ఆడుతున్నారు కేసీఆర్.

కొంతకాలంగా తెలంగాణలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్/మేయర్‌ల మధ్య వివాదాలు ఎక్కువైపోయాయి. చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం పదవీకాలాన్ని ఇద్దరు నేతలు పంచుకునేలా ఒకరు రెండున్నరేళ్లు, ఇంకొకరు రెండున్నరేళ్లు పదవి చేపట్టేలా ఒప్పందాలు జరిగాయి. కానీ, కొన్నిచోట్ల పదవి బదలాయింపు విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. పదవులను వీడేందుకు మున్సిపల్ చైర్మన్లు నిరాకరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలతో గొడవలు తీవ్రమవుతున్నాయి.

మున్సిపల్ చైర్మన్లకు వ్యతిరేకంగా అనేక మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. జనవరి 26తో తెలంగాణలోని 142 మున్సిపాలిటీలలో చైర్మన్ల పదవీకాలం మూడేళ్లు దాటింది. దీంతో పదవుల పంపకాల వివాదలు మొదలై అవిశ్వాసాలు ఎక్కువయ్యాయి.

నిజానికి నాలుగేళ్ల పదవీకాలం దాటితేనే అవిశ్వాసం పెట్టాలన్న బిల్లును తెలంగాణ అసెంబ్లీ సెప్టెంబరులో ఆమోదించారు. కానీ, అది గవర్నరు దగ్గర పెండింగులో ఉంది. దీంతో ఎమ్మెల్యేలు ఆయా మున్సిపాలిటీలలో చైర్మన్లపై అవిశ్వాసాలు పెట్టిస్తున్నారు. కొన్నిచోట్ల ఈ పంచాయతీలు బాగా ముదిరిపోయాయి. కొన్ని చోట్ల విషయం కేసీఆర్ వరకు వెళ్లినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేలను ఏమీ అనలేని పరిస్థితి కనిపిస్తోంది.

మొన్న శనివారం ఒక్కరోజే పెద్దఅంబర్ పేట, ఇబ్రహీంపట్నం, తాండూరు, వికారాబాద్, జవహర్ నగర్ మున్సిపాలిటీలలో అవిశ్వాసాలు పెట్టారు. ఇప్పటికే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే వేధిస్తున్నారంటే ఏడ్చిన వీడియో వైరల్ అయింది. ఆమె కూడా రిజైన్ చేశారు. జనగామ, నిర్మల్, ఇల్లందు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో ముసలం మొదలైంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.