Begin typing your search above and press return to search.

కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటన ఆ రోజే...?

By:  Tupaki Desk   |   28 Sep 2022 12:36 PM GMT
కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటన ఆ రోజే...?
X
తెలంగాణా ముఖ్యమంత్రి టీయారెస్ అధినేత కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటనను విజయదశమి రోజున చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన చక్కని ముహూర్తం కూడా పండితులతో మాట్లాడి ఖరారు చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. విజయదశం అక్టోబర్ 5న పడింది. ఆ రోజున మధ్యాహ్నం 1.19 నిముషాలకు కేసీయార్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

దానికి ముందుకు ఆయన టీయారెస్ శాసనసభా పక్ష భేటీని నిర్వహిస్తారు. వారితో చర్చింది అందరి ఆమోదంతో జాతీయ పార్టీ ప్రకటన చేస్తారు అని చెబుతున్నారు. ఇక ఈ జాతీయ పార్టీ పేరు ఏమిటి అన్నది ఆ రోజు వెల్లడిస్తారు. కానీ భారతీయ రాష్ట్ర సమితి, భారత నిర్మాణ సమితి వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు.

ఎక్కువ మంది మాత్రం కలసి వచ్చిన టీయారెస్ తరహాలో భారతీయ రాష్ట్ర సమితికే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇక కేసీయార్ జాతీయ రాజకీయాల్లో ఒక వెలుగు వెలగాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే మీడియా ముందుకు వచ్చి ఆయన తన మనసులో మాటను చెప్పింది మాత్రం 2018లో తెలంగాణా ఎన్నికల్లో రెండవ సారి గెలిచిన తరువాత మాత్రమే.

ఆయన 2019 ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ పేరిట అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ బీజేపీని ఢీ కొట్టాలని భావించారు. కానే తక్కువ సమయం ఉండడంతో అది కుదరలేదు. ఇక బీజేపీ ప్రభంజనం మరోసారి బలంగా వీచింది. దాంతో కేసీయార్ కొన్నాళ్ళు సైలెంట్ అయ్యారు. అయితే గత ఏడాదిగా ఆయన మళ్ళీ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల అధినేతలను పలువురిని కలిశారు.

అయితే పెద్దగా సానుకూలత రాలేదు. దాంతో కేసీయార్ ఏకంగా తన వంతుగా ఒక జాతీయ పార్టీని ఎందుకు ప్రారంభించకూడదు అన్న పట్టుదలతో పార్టీ పెట్టడానికే మొగ్గు చూపిస్తున్నారు. ఉతరాదికి చెందిన రైతు సంఘాలను కలసి వచ్చిన పార్టీలను కలుపుకుంటూ 2024 ఎన్నికలలో ఒక బలమైన శక్తిగా తన జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని కేసీయార్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోనిద్.

ఇంకో వైపు చూస్తే జాతీయ స్థాయిల కీలక నగరాలలో అతి పెద్ద బహిరంగ సభలను కూడా నిర్వహించి జాతీయ పార్టీకి పొలిటికల్ గా హైప్ తీసుకుని రావాలని కేసీయార్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక హిందీ భాష అనర్గళంగా మాట్లాడడం, వ్యూహాలను రూపొందించడం, దేశ రాజకీయాల మీద మంచి అవగాహన ఉండడడం కేసీయార్ కి కలసి వచ్చే అంశాలు. అదే టైం లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా వేళ్ళూనుకున్న నేపధ్యం ఉంది. ఎవరి రాజకీయ అవసరాలతో వారు ముందుకు సాగుతున్న వేళ కేసీయార్ జాతీయ పార్టీ ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయి అన్నది చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.