ఈటెల విషయంలో మరింత కరకుగా కేసీఆర్!

Mon Mar 01 2021 12:00:01 GMT+0530 (IST)

KCR more rough in the case of etela

మనసులో ఒక భావన పడితే త్వరగా దాన్ని మరిచిపోయే గుణం కొందరిలో ఉంటే.. మరికొందరు మాత్రం దాన్నే పట్టుకొని లాగుతూ పీకుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ రెండో కోవకు చెందుతారు. ఆయన మూడ్ చాలా సిత్రంగా ఉంటుందని చెబుతారు. ఏదైనా విసయంలో ఆయన నెగిటివ్ గా ఫీల్ అయితే చాలు.. ఆ విషయాన్ని తన దగ్గరకు రావటానికి ఇష్టపడరని చెబుతారు. ఎవరైనా నేత విషయంలో కేసీఆర్ కినుకు వహిస్తే.. ఇక ఆ నేతకు ఆయన దర్శనం దొరకదు సరికదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చేస్తారని చెబుతారు.తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖామంత్రి.. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేత.. కేసీఆర్ కు ఉద్యమం నాటి నుంచి కలిసి ఉన్న ఈటెల రాజేందర్ విషయంలో ఆయనీ మధ్య చాలా ఎక్కువగా ఫీల్ అయినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన్ను దగ్గరకు రానిచ్చేందుకు అస్సలు ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. గులాబీ జెండాకు అసలు ఓనర్లు తామేనన్న మాట కొద్ది నెలల క్రితం అనటం.. అది కచ్ఛితంగా కేసీఆర్ కు ధిక్కార స్వరమేనని చెబుతారు.

దీనికి తోడు..  ఈ మధ్యన ఆయన కొత్త పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంలో అధినేత నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయం ఈటెలకు ఉందని చెబుతారు. ఇలా.. పలు అంశాల్లో సారుతో విభేదిస్తున్న ఆయన్ను పక్కన పెట్టేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల జరిగిన పరిణామాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలువురు మంత్రులకు బాధ్యతల్నిఅప్పజెప్పారు. వాస్తవానికి మంత్రి ఈటెలకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ.. ఆయన తీరుపై గుర్రుగాఉన్న సీఎం.. ఆయనకు బదులుగా మంత్రి గంగులకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. ఇటీవల జరిగిన పలు సమీక్షా సమావేశాలకు సైతం ఆయనకు ఇన్విటేషన్ అందలేదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. ఫీల్ అయిన మంత్రి ఈటెల కరీంనగర్ కు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ గ్యాప్ ఇలానే పెరుగుతూ ఉంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. వాస్తవానికి మంత్రి ఈటెలను ఒక్కరిగా చూడలేం. ఆయన నాయకత్వంలో పెరిగిన నేతలు పలువురు ఉన్నారని.. అలాంటప్పుడు ఆయన్ను హర్ట్ చేస్తే వారిని కూడా మనసును కష్టపెట్టినట్లుగా చెబుతున్నారు. గులాబీ పార్టీలో ఈటెల వ్యవహారం ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది.