Begin typing your search above and press return to search.

సెలవు రోజు రివ్యూలతో సంపుడేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   19 July 2021 4:39 AM GMT
సెలవు రోజు రివ్యూలతో సంపుడేంది కేసీఆర్?
X
ఎప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అంచనా వేయటం చాలా కష్టం. రోజుల తరబడి తనకేమీ పట్టనట్లుగా ఫాం హౌస్ కు పరిమితమై.. రాష్ట్రంలో పాలన సాగుతుందా? లేదా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించే ముఖ్యమంత్రి కేసీఆర్.. మరికొన్ని సందర్భాల్లో రాత్రి పగలు అన్న తేడా లేకుండా పని చేస్తూ.. పని చేయిస్తుంటారు. ఆదివారం.. సెలవు రోజు అన్న విషయాన్ని పట్టించుకోకుండా రివ్యూ మీటింగ్ లను నిర్వహించే ఆయన.. అధికారులకు.. తన వద్ద పని చేసే నేతలకు చుక్కలు చూపిస్తారని చెబుతారు.

గతానికి భిన్నంగా గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. మాజీ మంత్రి ఈటల మీద భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తటం.. అనంతరం ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించటం మొదలు కేసీఆర్ లో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గడిచిన ఏడేళ్లలో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా ఉండటమే కాదు.. పాలనా రథాన్ని పరుగులు తీయించే పనిలో నిమగ్నమైనట్లుగా చెబుతున్నారు.

ఏడేళ్ల పాటు తాను చేసినప్పుడు మాత్రమే పని అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ కారణంగా.. పెండింగ్ ఫైళ్లు రాసులు పోసినట్లుగా గదుల్లో నిండిపోయి ఉండేవన్న విమర్శ కూడా ఉండేది. అంతేనా.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత కేసీఆర్.. ఒక పద్దతి ప్రకారంగా వివిధ శాఖల రివ్యూ మీటింగ్ నిర్వహించలేదన్న ఫిర్యాదు ఆయన మీద తరచూ వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు.. శాఖాధికారులతో భేటీలు కూడా క్రమపద్దతితో కాకుండా తనకు తోచినట్లుగా నిర్వహించటం కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపించే అలవాటుగా చెబుతారు.

అలాంటి కేసీఆర్.. తన తీరును మార్చేసుకోవటమే కాదు.. సెలవు రోజున.. పండుగ రోజుల్లోనూ రివ్యూల్ని నిర్వహిస్తున్న వైనం అధికారుల్ని.. సిబ్బంది అంతర్గతంగా హాహాకారాలు చేస్తున్న పరిస్థితి. వారంలో ఆరు రోజులు ఇష్టం వచ్చినంతసేపు పని చేయించుకున్నా ఫర్లేదని.. అందుకు భిన్నంగా ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించటం కేసీఆర్ వరకు బాగానే ఉన్నా.. వాటిల్లో హాజరయ్యే వారికి మాత్రంచుక్కలు కనిపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మింగాలేక.. కక్కాలేక.. ఊసురుమంటూపని చేయాల్సి వస్తోందని వేదన చెందుతున్నారు. గతంలో చాలామంది ముఖ్యమంత్రుల వద్ద పని చేసినా.. సీఎం కేసీఆర్ వద్ద పని చేయటం ఆషామాషీ వ్యవహారం కాదని చెబుతారు. ఓపిక.. సహనంతో పాటు.. కుటుంబాల్ని పట్టించుకోకుండా పని చేయాల్సిన రావటం కష్టమన్న మాట పలువురి నోటి వెంట వినిపిస్తోంది.

గతంలో అసలు పట్టనట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా పరుగులు తీయాలంటూ చేస్తున్న ఒత్తిడి అంతకంతకూ ఎక్కువై పోతున్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా రివ్యూ సమావేశం అంటే.. గంట రెండు గంటలు ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా కనీసం ఐదారు గంటలు.. గరిష్ఠంగా తొమ్మిది గంటల పాటు నాన్ స్టాప్ గా భేటీలు సాగటం తెలిసిందే. ఇన్నేసి గంటలు రివ్యూల్లో కూర్చున్న తర్వాత మిగిలిన పని చేయటానికి ఓపిక ఉండటం లేదని వాపోతున్నారు. ఇక.. సండే లాంటి సెలవు రోజుల్లో నిర్వహించే రివ్యూ భేటీ.. పనిష్మెంట్ గా ఫీలయ్యే పరిస్థితి. మరీ.. సమాచారం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పటికి చేరేను? అన్నది అసలు ప్రశ్న.