Begin typing your search above and press return to search.

టెన్ష‌న్‌లో కేసీఆర్‌.. స‌ర్వేల‌కు సై!

By:  Tupaki Desk   |   4 Dec 2021 10:37 AM GMT
టెన్ష‌న్‌లో కేసీఆర్‌.. స‌ర్వేల‌కు సై!
X
ఎంత తిరుగులేని నాయ‌కుడైనా కొన్ని సంద‌ర్భాల్లో త‌గ్గ‌క త‌ప్ప‌దు. ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ‌డానికి అవ‌స‌ర‌మైన దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు పూనుకోక త‌ప్ప‌దు. ప్ర‌జ‌ల నాడీని తెలుసుకునేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేయ‌కా త‌ప్ప‌దు. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈ విష‌యాన్ని తెలుసుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఆయ‌న‌కు అర్థ‌మైన‌ట్లు తెలుస్తోంది. అందుకే ప్ర‌స్తుతం రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిపై అంచ‌నాకు వ‌చ్చేందుకు స‌ర్వేలు చేయించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఆ ఓట‌మితో..

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి కేసీఆర్పై తీవ్ర ప్ర‌భావం చూపింద‌నేది కాద‌న‌లేని నిజం. పైకి ఏదో ప‌ట్టించుకోన‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ లోప‌ల మాత్రం ఆ ఓట‌మి ద‌హించివేస్తోంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఆ ఎన్నిక‌లో త‌న శ‌క్తియుక్తులు ధార‌పోసినా ఆయ‌న త‌న పార్టీని గెలిపించుకోలేక‌పోయారు. ముఖ్యంగా ప్రపంచంలోనే ఉత్త‌మ ప‌థ‌కం అంటూ ద‌ళిత బంధును ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్ర‌వేశపెట్టినా లాభం లేకుండా పోయింది. కేసీఆర్ లెక్క త‌ప్పింది. దీంతో కేసీఆర్ పేరు చెబితేనే ఓట్లు రాల‌వ‌ని అర్థ‌మైపోయింది. అందుకే ఈ టీఆర్ఎస్ అధినేత ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఓట‌మితో భ‌విష్య‌త్‌పై భ‌యం ప‌ట్టుకుంద‌ని స‌మాచారం.

ఆ సంస్థ‌తో..

జ‌నం అంచ‌నాలు ప‌ట్టుకోవ‌డంలో తానే నంబ‌ర్‌వ‌న్ అనేది కేసీఆర్ ఆలోచ‌ని అని చెబుతుంటారు. ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి అందుకు త‌గిన‌ట్లుగా వ్యూహాలు ర‌చించ‌డంలో కేసీఆర్ దిట్ట అనే పేరు కూడా ఉంది. కానీ హుజూరాబాద్ ఓట‌మితో అదంతా తారుమారైన‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే ప్ర‌స్తుతం రాష్ట్రంలో స‌ర్వే కోసం ఆయ‌న ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన సంస్థ ఐ ప్యాక్ సాయం తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. ఇప్పటికే ఆ సంస్థ ప్ర‌తినిధుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతానికైతే స‌ర్వేల వ‌ర‌కే ఐ ప్యాక్‌ను వాడుకోవాల‌ని భ‌విష్య‌త్‌లో ఏమైనా అవ‌స‌రం ఉంటే అప్పుడు మ‌రిన్ని సేవ‌లు పొందాల‌ని కేసీఆర్ నిర్ణ‌యంగా తెలుస్తోంది.

ఆ అంశాల‌పై..

ఏడేళ్ల టీఆర్ఎస్ పాల‌న‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్న వ్య‌తిరేక‌త‌, పార్టీ యంత్రాంగం ప‌నితీరుపై ఐ ప్యాక్‌తో స‌ర్వే చేయించాల‌ని కేసీఆర్ చూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆయ‌న ఐ ప్యాక్ సాయం కోరార‌ని స‌మాచారం. త‌న ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివిధ సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణ‌యాల‌పై ప్రజాభిప్రాయాన్ని సేక‌రించ‌డం ఈ స‌ర్వే ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.