Begin typing your search above and press return to search.

ఏడాదిలో కేసీఆర్ గ్రాఫ్ అంతలా పడిపోయిందా?

By:  Tupaki Desk   |   9 Aug 2020 2:30 AM GMT
ఏడాదిలో కేసీఆర్ గ్రాఫ్ అంతలా పడిపోయిందా?
X
అనుకోని రీతిలో విడుదలైన ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోఆసక్తికర చర్చకు తెర తీశాయి. తెలంగాణలో తిరుగులేని రాజకీయ అధినేతగా అవతరించిన కేసీఆర్ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయిందన్న విషయాన్ని సర్వే వెల్లడిస్తే.. అదే సమయంలో పక్కనున్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ భారీగా పుంజుకోవటమే కాదు..దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది.

గులాబీ నేతలు పలువురు సీఎం కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించటమే కాదు.. ఆయనకు సాటి రాగల నేత తెలంగాణ రాష్ట్రంలోనే లేరన్నట్లుగా చెప్పటం తెలిసిందే. మరి.. మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో తెలంగాణలో ప్రజాదరణ విషయం ఏమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ సర్వే ఇటీవల కాలంలో చేయటం.. చూసినప్పుడు ఆయన ఇమేజ్ తగ్గిందా? అన్న సందేహం కలుగక మానదు.

దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఏపీ సీఎం జగన్ నిలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఏకంగా తొమ్మిదో స్థానానికి పరిమితం కావటం గమనార్హం. యోగికి 24 శాతం ఓట్లను సొంతం చేసుకోగా.. కేజ్రీవాల్ 15 శాతం ఓట్లు.. జగన్ కు 11 శాతం ఓట్లు వచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కు మాత్రం కేవలం మూడు శాతం ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆ మధ్యన విడుదలైన పలు సర్వేల్లో కేసీఆర్ ఇమేజ్ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. అందుకు భిన్నంగా తాజా సర్వే లో మాత్రం కేసీఆర్ ఇమేజ్ ఇంతలా దెబ్బ తినటం ఏమిటి? దానికి కారణం ఏమిటన్న విస్మయాన్ని గులాబీ దళం వ్యక్తం చేస్తోంది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో దేశంలో పాపులర్ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచిన కేసీఆర్.. కేవలం ఏడాది వ్యవధిలో అందుకు భిన్నంగా ఆయన ఆదరణ తగ్గిందన్న సర్వే ఫలితం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. ప్రతికూల పరిస్థితుల్లో మేజిక్ చేసి.. మొత్తాన్ని మార్చేసే కేసీఆర్.. మరోసారి అలాంటిదే చేయాలన్న మాట గులాబీ దళం కోరుకుంటోంది. ఇంతకీ.. ఈ సర్వే రిపోర్టు మీద సీఎం కేసీఆర్ స్పందిస్తారంటారా?