Begin typing your search above and press return to search.

అపాయింట్ మెంట్ లేకుండానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారా..?

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:42 AM GMT
అపాయింట్ మెంట్ లేకుండానే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారా..?
X
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో పోరాడుతున్న కేసీఆర్..ఢిల్లీ నాయకులతో అమీ తుమీ తేల్చుకోవాలని అక్కడికి వెళ్లారు. అయితే ముందుగా అపాయింట్ మెంట్ తీసుకోకుండానే కేసీఆర్ ఢిల్లీకి రావడంతో వారిని కలుసుకోలేనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలుసుకోలేని కేసీఆర్.. ప్రధాని మోదీ, అమిత్ షా లతో భేటీ అనుమానమేనని అంటున్నారు.

ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఇప్పటి వరకు నిరిక్షిస్తూనే ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పౌర సరఫరాల, ఆర్థిక, వ్యసాయ ఉన్నతాధికారులు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ కార్యదర్శి సుధాం పాండేను కలిశారు. కానీ వారు మళ్లీ అదే విషయం చెప్పడంతో అధికారులు నిరాశ చెందినట్లు సమాచారం.

తెలంగాణ నుంచి కేంద్ర వరిధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించమని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదని, ధాన్యం కొనుగోలు చేస్తామని లేఖ ద్వారా హామీ పత్రం ఇచ్చే వరకు పోరాడుతామని అన్నారు. అయితే ఇటీవల కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించిన ధర్నా కేంద్రానికి సెగ తగిలిందని కొందరు టీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు.

మరోవైపు కేసీఆర్ ధ్యానం కొనుగోలుకు ఇక ఢిల్లీ వేదికగా ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రి ఢిల్లీ పయనమయ్యారు. వరిధాన్యం కొనుగోలుతో పాటు జల వివాదాల్లో పరిష్కారానికి కేంద్ర మంత్రులను కలిసి చర్చిస్తానని అన్నారు.

అయితే ఢిల్లీ వెళ్లి ఒకరోజు గడుస్తున్నా ఆయన ఇప్పటి వరకు ఒక్క కేంద్ర మంత్రిని కూడా కలవలేదు. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాక మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వర్తక ప్రతినిధుల సమావేశంలో బిజీగా ఉన్నారు. దీంతో కేసీఆర్ ఆయనతో భేటీ సాధ్యం కాలేదు. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జోధ్ పూర్ కు బయలుదేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు తిరిగి రారు.

దీంతో వీరితో ముందుగా అపాయింట్ మెంట్ సెట్ చేసుకోకుండానే కేసీఆర్ ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది. గత సెప్టెంబర్లో కేసీఆర్ ఆ ఇద్దరు మంత్రులతో రెండేసీ సార్లు భేటీ అయ్యారు. అయితే అప్పుడే మళ్లీ కలవడానికి అపాయింట్ మెంట్ కుదరలేదని కొందరు అంటున్నారు. మరోవైపు ఇంతలో మార్పేమీ ఉండదని అధికారులు అంటున్నారు. అయితే కేంద్రమంత్రులనే కలవడం సాధ్యం కానప్పుడు ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలుసుకుంటారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు కేంద్ర ఆహార పంపిణీ శాఖ అధికారి సుధాంషు పాండేను కలిశారు. అయితే ఇదివరకు చెప్పినట్లే ఉప్పుడు బియ్యం కొనమని, ముడిబియ్యం పెంపు సేకరణను పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం.

అయితే అధికారులు ఇలా చెబుతున్న ప్రకారం కేంద్ర మంత్రిని కలిసినా ఇదే సమాధానం వస్తుందని అంటున్నారు. ఇక రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశం అయ్యారు. ట్రైబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి న్యాయ సలహా కోసం పంపామని, అక్కడి నుంచి అభిప్రాయం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ న్యాయ సలహా ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.