Begin typing your search above and press return to search.

మళ్లీ ముందస్తుకు కేసీఆర్?

By:  Tupaki Desk   |   23 Nov 2021 11:30 AM GMT
మళ్లీ ముందస్తుకు కేసీఆర్?
X
ఉద్యమ పార్టీగా ఎన్నో ఉప ఎన్నికలు చూసిన టీఆర్ఎస్. ఒకటీ,రెండు తప్ప అన్ని ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా తెలంగాణ సాధించాక కూడా ఒకటీ, రెండు ఉప ఎన్నికల్లో మినహా అన్నిటిలోనూ జయకేతనం ఎగురవేసింది. అంతేకాక, 2018లో అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం ఖాతాలో వేసుకుంది. నాడు వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు.

తొలుత ముందస్తుకు వెళ్లడాన్ని తప్పని అందరూ అంచనా వేసినా, ఆ తర్వాత వచ్చిన ఫలితాన్ని చూసి తమ లెక్కలు తప్పని ఒప్పుకొన్నారు.

నాడు అవకాశాన్ని అందిపుచ్చుకుని..

2006లో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేకే, వెంకటస్వామి, ఎం.సత్యనారాయణ విసిరిన సవాలును స్వీకరించి కేసీఆర్ కరీంనగర్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అనూహ్యంగా వారి నుంచి వచ్చిన సవాలుపై అంతే అనూహ్యంగా స్పందించి తెలంగాణవాదాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు.

ఓ విధంగా చెప్పాలంటే.. నాడు అధికారంలో ఉన్నవారు... ‘‘ఎక్కడుంది తెలంగాణ’’ అని ప్రశ్నిస్తే, ‘‘ఇదిగిదిగో తెలంగాణ’’అని కరీంనగర్ లో తన విజయం ద్వారా చాటి చెప్పారు కేసీఆర్. ఆ తర్వాత 2008,2010లో సందర్భానుసారం ఉద్యమ పథంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్, కేసీఆర్ కు పదువులు లెక్క కాదని.. తెలంగాణ సాధనే వారి లక్ష్యమని చెప్పేందుకు ఉపయోగపడ్డాయి.

అధికారంలోకి వచ్చాక..

2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అనంతరం ఉమ్మడి ఏపీ విడిపోయాక.. తెలంగాణలో టీఆర్ఎస్ బొటాబొటీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 119 స్థానాలకు గాను.. 63 సీట్లు సాధించింది. అయితే, నాడు ఉన్న పరిస్థితులు.. రాజకీయ పునరేకీకరణ అంశంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. వీరిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, వైసీపీ ఇలా అన్ని పార్టీల వారూ ఉన్నారు.

అయితే, అప్పటికీ ప్రతిపక్షాలు బలంగా ఉండడంతో అధికార టీఆర్ఎస్ పై చీటికీ మాటికీ ఆరోపణలు చేసేవి. ఓ దశలో వీటితో విసుగెత్తిన కేసీఆర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. అదే.. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు. ఈ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన ప్రతిపక్షాలు.. శక్తినంతా కూడగట్టుకుని ఎన్నికల్లో తలపడినా టీఆర్ఎస్ ముందు నిలువలేకపోయాయి. కాంగ్రెస్, టీడీపీ మహా కూటమి కట్టినా.. మరింత చిత్తుగా ఓడిపోయాయి. నాటి ఎన్నికలు జరిగిన దాని ప్రకారం తెలంగాణలో 2023 డిసెంబరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి.

ఇప్పుడూ అదే మంత్రమా?

2018లో విజయానంతరం కేసీఆర్ కు 2019 లోక్ సభ ఎన్నికలు నల్లేరుపై నడకే అనుకున్నారు. ‘‘సారూ.. పదహారు’’నినాదంతో తెలంగాణలోని హైదరాబాద్ మినహా 16 లోక్ సభ స్థానాలనూ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ ప్రణాళికలు వేసింది. దీనికితగ్గట్టే అన్నిచోట్ల టీఆర్ఎస్ దే విజయమని భావించారు. కానీ, అనూహ్యంగా 9 స్థానాలకే పరిమితమైంది.

ఒక్కసారిగా పుంజుకొన్న బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా గెలిచి లోక్ సభలో అడుగుపెట్టారు. బీజేపీ నుంచి గెలిచిన వారిలో బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్)లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారారు. ఇక సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఈ దూకుడు మరింత పెరిగింది.

మరోవైపు అర్వింద్ సైతం అందుకుతగ్గట్లే దూకుడు చూపుతూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో తొలిసారి ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నుంచి మాత్రమే ప్రతిఘటన ఎదుర్కొన్న కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా సవాల్ వస్తోంది. ఈ రెండు పార్టీలే కాక వైఎస్సార్ టీపీ అంటూ షర్మిల తోడయ్యారు. ఐపీఎస్ కొలువుకు రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.

అయితే, వీరంతా దూకుడు మరింత పెంచకముందే... శక్తి యుక్తులు కూడదీసుకోకముందే.. తెలంగాణ అసెంబ్లీకి రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన సాగుతున్నట్లు సమాచారం. ఈ మేరకే మరోసారి ముందస్తు ముచ్చట్లు వినిపిస్తున్నాయి. 2023లో రావాల్సిన ఎన్నికలను 2022లోనే జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట.

ఇంతకీ కేసీఆర్ ముందస్తు వ్యూహం ఎందు కోసం..? ఎవరి కోసం..?

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయనే నెపంతో ఏడాది ముందుగా 2018లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈసారి 25 సీట్లు పెరిగాయి. కేసీఆర్ 100 సీట్ల టార్గెట్ పెట్టుకుంటే స్కోర్ 88 వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత కూడా మళ్లీ వలసల పర్వం కొనసాగింది. అయితే ఈసారి కేసీఆర్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. దుబ్బాక, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.

దుబ్బాకలో అభ్యర్థి మారితే, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థే బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ గుర్తుపై గెలిచారు. ఒకరకంగా ఈ అవమానాలతో కేసీఆర్ కాస్త సైలెంట్ అవుతారని అనుకున్నారంతా. కానీ అసలు విషయం అప్పుడే మొదలైంది. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని గ్రహించిన కేసీఆర్.. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వారు. రైతుల్ని రెచ్చగొట్టి ఏకంగా సీఎం కూడా రోడ్లపై కూర్చున్నారు, ధర్నాలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఆ వెంటనే ఇప్పుడు రైతు చట్టాల రద్దుకి కేంద్రం సిద్ధపడటంతో పైచేయి నాదేనంటూ కదం తొక్కారు.

అక్కడ బీజేపీకి ఎదురదెబ్బ తగిలితే..

వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీ, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కూడా ఆ రాష్ట్రాలతో కలసిపోవాలని చూస్తున్నారు. ఎలాగూ బీజేపీకి దేశవ్యాప్తంగా నెగెటివ్ వేవ్ ఉంది కాబట్టి.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం ఇక్కడ కూడా పనిచేస్తుందని ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బీజేపీని బలపడకుండా చేయాలన్నా, కాంగ్రెస్ కి అవకాశం లేకుండా చేయాలన్నా.. మందస్తుకి వెళ్లడమే మార్గమనేది ఉత్తమమని కేసీఆర్ ఆలోచన.. మరి ఈ వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తారా.. లేక ఐదేళ్ల టర్మ్ ముగిసేవరకు ఎదురుచూస్తారా అనేది తేలాల్సి ఉంది.