Begin typing your search above and press return to search.

కదిలించుకొని కాటేయించుకోవటం అంటే దీన్నే అంటారు కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Jan 2023 9:53 AM GMT
కదిలించుకొని కాటేయించుకోవటం అంటే దీన్నే అంటారు కేసీఆర్
X
విషయం ఏదైనా అవసరానికి మించిన కసరత్తు చేసే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదట్నించి ఉన్నదే. ఈ కారణంతోనే ఆయనకు విషయాల మీద లోతైన అవగాహన ఉంటుందని చెబుతారు. ఒకవేళ ఏదైనా విషయం మీద తనకున్న నాల్డెజ్ అంతంతగా ఉంటే.. వెంటనే ఆ లోటును భర్తీ చేసేందుకు వీలుగా పెద్ద ఎత్తున అధ్యయనం చేస్తుంటారు. ఉద్యమ కాలం నుంచి ఉన్న ఈ అలవాటే.. తెలంగాణ ఉద్యమంలో మిగిలిన వారికి భిన్నంగా గులాబీ బాస్ ను నిలిచేలా చేసిందని చెప్పాలి. అలాంటి కేసీఆర్.. చేతికి అధికారం వచ్చిన తర్వాత నిమ్మళంగా మారారా?

తాను కత్తి దూసే వారి నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రిపేర్ అవ్వాలన్న కనీస విషయాల్ని మర్చిపోయారా? అన్నది సందేహంగా మారింది. బడ్జెట్ ను ఆమోదించాల్సిన గవర్నర్ ఆ పని చేయలేదని.. అందుకే హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం ద్వారా.. ఆ పనిని పూర్తి చేయించుకోవాలని భావించిన కేసీఆర్ సర్కారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పిటిషన్ విచారణ మొదలైనంతనే.. హైకోర్టు ధర్మాసనం కొన్ని ప్రశ్నల్ని సంధించింది. అందులో కొన్నింటిని చూస్తే..

గవర్నర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చా?

గవర్నర్ విధుల వ్యవహారంలోన్యాయ సమీక్షకు అవకాశం ఉందా?

ఈ విషయంలో హైకోర్టు పరిధి ఏమిటి?

న్యాయ వ్యవస్థ తన అధికార పరిధిని మీరుతోందని మీరే అంటున్నారు. మరి.. ఈ విషయంలో హైకోర్టు జోక్యం ఎలా చేసుకుంటుంది? అంటూ పలు ప్రశ్నల్ని సంధించింది. ఇక్కడి వరకు విషయం ఒకలా ఉన్నా.. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే రంగంలోకి దిగారు. తమ వాదనల్నిపదునుగా షురూ చేశారు. ఆయన వినిపించిన వాదనల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే..

- బడ్జెట్‌కు ఆమోదం తెలిపే విషయంలో గవర్నర్‌కు విచక్షణాధికారం లేదు. రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును యధాతథంగా ఆమోదించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 202 నిర్దేశిస్తోంది.

- ఆర్టికల్‌ 356, 371 ప్రకారం గవర్నర్‌కు స్వేచ్ఛ.. విచక్షణాధికారం ఉంటుంది. ఆర్టికల్‌ 202 విషయంలో మాత్రం రాజ్యాంగం గవర్నర్‌కు విచక్షణాధికారం ఇవ్వలేదు.

- బడ్జెట్‌ మనీ బిల్లు కిందకి వస్తుంది. ఆమోదం తెలపడం తప్ప గవర్నర్‌కు మరో అవకాశం లేదు.

- రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ తన విధిని నిర్వహించకపోతే న్యాయసమీక్షకు తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పింది.

- గవర్నర్‌ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం పని చేయాల్సిందే. వ్యక్తిగత వ్యవహారాలకు.. వ్యక్తిగత అసంతృప్తులకు ఇక్కడ తావులేదు.

- గవర్నర్‌లు ప్రదర్శించే విచక్షణాధికారం సైతం రాజ్యాంగబద్ధంగా ఉండాలి.

- బడ్జెట్‌కు ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై హైకోర్టుకు రావడం ప్రభుత్వానికి కూడా బాధాకరం. ఇలా పిటిషన్‌ వేయాల్సి రావడం పట్ల ప్రభుత్వం కూడా సంతోషంగా లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు రావాల్సి వచ్చింది.

ఇలా పలు కారణాల్నిఎత్తి చూపిన ఆయన.. గవర్నర్ పై తాము పోరు కోవటం లేదన్నట్లుగా వాదనలు వినిపించారు. ఈ సమయంలో హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకొని.. రెండు రాజ్యాంగ వ్యవస్థలు ఇలా ఘర్షణలకు దిగితే ఎలా? అని ప్రశ్నించింది. ఈ సందర్భంగా దవే కాస్తంత తగ్గినట్లుగా వ్యవహరిస్తూ.. మనీ బిల్లును యధాతథంగా ఆమోదించే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్ ను రిక్వెస్టు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినా తమకు సమ్మతమేనని పేర్కొన్నారు.

అయితే.. ప్రభుత్వం తరఫున దవే.. గవర్నర్ తరఫున న్యాయవాదితో మాట్లాడాలని ధర్మాసనం సూచన చేసింది. అప్పటికే మధ్యాహ్నం కావటంతో.. భోజన అనంతరం వాదనలు వినేందుకు ధర్మాసనం ఒప్పుకుంది. అయితే.. కోర్టు పేర్కొన్నట్లుగా ఇరు వర్గాలు చర్చలు జరపటం. ఆ సందర్భంగా గవర్నర్ ను ఉద్దేశించి కించపరిచేలా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దవే వరకు వచ్చాయి.
దీంతో.. ఆయన తన తదుపరి వాదనల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తే.. కీలక వ్యాఖ్య చేశారు. గవర్నర్ పట్ల కించపరిచే వ్యాఖ్యలు చేయటం సరికాదని.. ఆ మాటకు వస్తే దేశంలో ఏ మహిళను కించపర్చరాదన్నారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో తాము ఏకీభవించటంలేదని.. తాము ఖండిస్తామన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని ప్రభుత్వానికి సూచన చేస్తానని చెప్పటంతో.. రాజీ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది.

అదేదో ముందే.. గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ఒప్పుకొని ఉంటే ఇంత పంచాయితీ ఉండేది కాదు కదా? గవర్నర్ ను కోర్టు వరకు తీసుకొచ్చి.. అక్కడ నుంచి ఆదేశాలు అందుకొని గవర్నర్ చేత తమకు నచ్చినట్లుగా చేయించుకోవచ్చన్న కేసీఆర్ ఆలోచన ఎదురు దెబ్బేయటమే కాదు.. గుట్టుగా తగ్గే కన్నా.. అందరి ముందు తగ్గాల్సి రావటం కేసీఆర్ లాంటి నేతకు ఇబ్బంది కలిగించేదే. అందుకే అనేది.. తొందరపడి కెలితే.. ఏదో ఒకటి కాక తప్పదని ఊరికే అనలేదేమో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.