Begin typing your search above and press return to search.

నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం..

By:  Tupaki Desk   |   24 Nov 2021 11:30 AM GMT
నాలుగు రోజులుగా ఢిల్లీలో మకాం..
X
బుధవారం మధ్యాహ్నానికి 36 గంటలైంది.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి. శనివారం ధర్నా చౌక్ లో మహా ధర్నా చేసి.. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం రణభేరి మోగించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటూ ప్రకటించిన కేసీఆర్ ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనుమరాలి వివాహంలో పాల్గొని అటునుంచి అటే ఢిల్లీ బయల్దేరారు. తొలుత చెప్పినదాని ప్రకారం సీఎం ఢిల్లీ టూర్ మూడు రోజులే. అంటే, బుధవారంతో ముగియాలి. కానీ, ఇప్పటికీ కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు.

అప్పాయింటు‘మంట’..

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో మూడు రోజులుగా కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీని కలిసేందుకు నిరీక్షిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కాబట్టి లెక్కలోంచి తీసేసినా.. సోమ, మంగళవారాలు పూర్తి పనిదినాలే. అయితే, ధాన్యం కొనుగోలుపై కలిసేందుకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఖాళీగా లేరు.

అమెరికా వర్తక ప్రతినిధులతో ఆయన షెడ్యూల్ బిజీ అయిపోయింది. ఇక సాగునీటి అంశాలపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలుద్దామంటే ఆయన రాజస్థాన్ లోని జోధ్ పూర్ వెళ్లారు. రెండ్రోజుల వరకు రాలేని పరిస్థితి. మరోవైపు అసలు కేసీఆర్ నిర్దిష్ట అపాయింట్ మెంట్లు లేకుండానే ఢిల్లీ వచ్చారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

దీనికితగ్గట్టే.. మోదీతో పాటు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పియూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ తప్ప మరే ఇతర కేంద్ర మంత్రులు సీఎం బృందానికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ప్రధానంగా ప్రధాని మోది, గంజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యేందుకు తెలంగాణ సీఎం ఆసక్తి చూపిస్తున్నప్పటి వారి అపాయింట్ మెంట్ గగనంగా మారింది.

ప్రధాని కలవనట్టేనా?

అంతే కాకుండా సీఎం ఢిల్లీ పర్యటన పీరిలేవదు, కట్టె కాలదు అన్న చందంగా తయారయ్యందని ప్రతిపక్ష పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. బీజేపి, సీఎం చంద్రశేఖర్ రావు డ్రామాలో భాగంగానే కేంద్ర మంత్రులు సీఎం చంద్రవేఖర్ రావును సంప్రదించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఢిల్లీ తెలంగాణ భవన్ లో బిల్లులు రెట్టింపవ్వడం తప్ప మరో ప్రయోజనం ఉండదని, రోడ్ల మీద ఆరబెట్టిన వరి ధాన్యం మొలకెత్తి మరోసారి కాపుకొచ్చే సమయం వరకూ చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో అడుగు పెట్టరని ప్రతిపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అసలు ధాన్యం సేకరణ అంశం ముగిసిన అధ్యయమని, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేశారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు.

కనికరం కరవైనట్టేనా?

ధాన్యం సేకరణపై ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రులతో భేటీ అయింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ధాన్యం సేకరణ విషయం ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. అయితే మరోసారి భేటీ కావాలని మంత్రుల బృందం నిర్ణయించుకుంది. అయితే మరోసారి భేటీపై స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్రమంత్రులతోనే సరా?

కేంద్ర మంత్రులతో భేటీ అయిన రాష్ట్ర మంత్రులు.. తెలంగాణ నుంచి రెండు సీజన్లలో ధాన్యం సేకరించాలని, అందులో భాగంగా 100 నుంచి 120 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి మేరకు, ఏ సీజన్‌లో ఎంత ధాన్యం ఉంటుందనే విషయంపై స్పష్టత కావాలని కేంద్రం కోరింది. సరైన ప్రణాళికతో సవివరంగా వస్తే నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని కేంద్రం తెలిపింది.

మంత్రుల బృందం ప్రతిపాదించిన కొన్ని అంశాలపై తోమర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న మరోసారి రాష్ట్ర ప్రతినిధులు, గోయల్‌ తో మరోసారి సమావేశం అవ్వనున్నారు. ఆ రోజైనా, ధాన్యం కొనుగోలుపై తుది నిర్ణయం వస్తుందని మంత్రులు భావిస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులతో జరిగిన చర్చల గురించి వివరించారు.