Begin typing your search above and press return to search.

పండుగ అయిపోయింది..కీలక పరిణామాలకు వేదిక నేడు!

By:  Tupaki Desk   |   9 Oct 2019 6:11 AM GMT
పండుగ అయిపోయింది..కీలక పరిణామాలకు వేదిక నేడు!
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ చోటు చేసుకోని పరిణామంగా చెప్పాలి. ఏదైనా పెద్ద పండుగ వస్తున్నప్పుడు.. ఆందోళనలు. నిరసనల్ని తగ్గించేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవటం.. పండుగ కానుకగా చెప్పి ఇష్యూను క్లోజ్ చేయటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించటమే కాదు.. డిస్మిస్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలపై కార్మిక నేతలు.. యాభైవేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె విషయంలో ఎంతవరకైనా వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్న విషయం ఆది.. సోమవారాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కానీ ఆర్టీసీ సంఘ నేతలకు అర్థం కాలేదు. అయితే.. ఇలాంటి తీరును ఏ మాత్రం ఊహించని వారికి కేసీఆర్ తీరు షాకింగ్ గా మారింది.

కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుకు ప్రతిగా ఎలా రియాక్ట్ కావాలన్న విషయంపై ఆర్టీసీ సంఘ నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో దసరా పండుగ కూడా రావటంతో ఇష్యూ మీద అంతగా ఫోకస్ చేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలు సైతం ఆర్టీసీ విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరుపై ఏం చేయాలన్న ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకోలేని పరిస్థితి.

పండుగ తర్వాత చూద్దామన్న తాత్కాలిక నిర్ణయంతో రాజకీయ పార్టీలు.. కార్మిక సంఘాలు ఆగాయి. ఇప్పుడు పండుగ అయిపోయింది. కార్యాచరణ ఏమిటి? కేసీఆర్ చెప్పినట్లే 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలు పోయినట్లేనా? దీనిపై కార్మికులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారన్న కీలక అంశాలకు ఈ రోజు వేదిక కానుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె.. రానున్న రోజుల్లో ఏ తీరులోకి మారుతుందన్న విషయంపై ఈ రోజు స్పష్టత రానుందని చెప్పాలి. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె విషయంలో కేసీఆర్ అదే పంతంతో.. పట్టుదలతో ఉన్నారా? అన్న విషయం మీదా ఈ రోజు అంతో ఇంతో స్పష్టత రానుంది. ఏమైనా.. తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పే పరిణామాలకు ఈ రోజు వేదిక అవుతుందని మాత్రం చెప్పక తప్పదు.