Begin typing your search above and press return to search.

ఫెడ‌ర‌ట్ ఫ్రంట్ ను సెట్స్ మీద‌కు తెచ్చేలా కేసీఆర్ ప్లానింగ్!

By:  Tupaki Desk   |   24 April 2019 4:22 AM GMT
ఫెడ‌ర‌ట్ ఫ్రంట్ ను సెట్స్ మీద‌కు తెచ్చేలా కేసీఆర్ ప్లానింగ్!
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సుడి అంటే సుడినే. ఆయ‌నేం కోరుకుంటారో.. అందుకు త‌గ్గ‌ట్లుగా అప్ప‌టివ‌ర‌కూ మాట్లాడిన మాట‌లకు భిన్న‌మైన మాట‌ల్ని చెబుతారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేసీఆర్ మాట‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు న‌మ్మేయ‌ట‌మే కాదు.. పాత మాట‌ల‌కు.. కొత్త మాట‌ల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని విప్పి చెప్పేటోళ్లు.. చైత‌న్యాన్ని పెంచే రాజ‌కీయ బ్యాచ్ లేని లోటు ఇప్పుడు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

కీల‌క‌మైన ఎన్నిక‌లకు కాస్త ముందుగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ భావ‌న‌ను తెర మీద‌కు తెచ్చిన కేసీఆర్.. అందులో భాగంగా ప‌లు రాష్ట్రాలకు చెందిన కీల‌క నేత‌లతో భేటీ కావ‌టం తెలిసిందే. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌కు ముందు ఇంత హ‌డావుడి చేసిన కేసీఆర్.. ఎన్నిక‌ల‌వేళ ఈ ఇష్యూ మీద సౌండ్ చేయ‌ని తీరు భారీ చ‌ర్చ‌కు దారి తీసింది. ఎన్నిక‌ల వేళ‌.. ఏ రాష్ట్రానికి ప్ర‌చారం చేసేందుకు వెళ్ల‌ని కేసీఆర్‌.. తాజాగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కూట‌మికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

రానున్న కొద్ది రోజుల వ్య‌వ‌ధిలో ప‌లు రాష్ట్రాలు ప‌ర్య‌టించి.. వివిధ పార్టీల నేత‌ల్ని క‌లిసేలా కేసీఆర్ ప్లానింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఒక‌ట్రెండు రోజుల్లో రిలీజ్ చేస్తామ‌న్న మాట వినిపిస్తోంది. మూడో విడ‌త పోలింగ్ ముగిసిన వేళ‌లోనే.. కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను తెర మీద‌కు తీసుకురావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఉన్న‌ట్లుండి కేసీఆర్ ఈ నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఏదైనా ఇష్యూ ఉందా? అన్న‌ది ప్ర‌శ్న‌లుగా మారాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఇప్ప‌టికే ఎన్నిక‌లు పూర్తి అయిన రాష్ట్రాల్లో కేసీఆర్ ప‌ర్య‌టించ‌నున్నారు. త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ క‌ల‌ను వారికి వివ‌రించి.. జ‌ట్టు క‌ట్టే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికి జ‌రిగిన మూడు విడ‌త‌ల్లో పోటీ తీవ్రంగా ఉండ‌టం.. అటు మోడీకి కానీ.. ఇటు కాంగ్రెస్ కు కానీ ప‌రిస్థితులు అనుకూలంగా ఉండే అవ‌కాశం లేద‌న్న స‌మాచారంతోనే కేసీఆర్ త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను తెర మీద‌కు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫ‌లానా రీతిలో రావ‌టం ఖాయ‌మంటూ తెలంగాణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ చెప్పే మాట‌లు ఇప్ప‌టివ‌ర‌కూ నిజ‌మ‌య్యాయి. వివిధ రాష్ట్రాల్లో జ‌రిగిన ఎన్నిక‌ల తీరు.. తుది ఫ‌లితాలు ఏ పార్టీల‌కు అనుకూలంగా ఉంటాయ‌న్న విష‌యం మీద‌న కేసీఆర్ ఇప్ప‌టికే క్లారిటీకి వ‌చ్చేశార‌ని.. ఈ కార‌ణంతోనే ఆయ‌న త‌న ఫెడ‌ర‌ల్ నినాదాన్ని మ‌ళ్లీ తెర మీద‌కు తెచ్చారా? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు తెర మీద‌కు తెచ్చే కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ విష‌యంలో వివిధ రాష్ట్రాల నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.