Begin typing your search above and press return to search.

కేసీఆర్ ‘కరోనా వార్ ప్లాన్’ ఇదేనట..

By:  Tupaki Desk   |   28 March 2020 7:30 PM GMT
కేసీఆర్ ‘కరోనా వార్ ప్లాన్’ ఇదేనట..
X
తెలంగాణ కల సాకారం అవుతుందా? అన్న ప్రశ్న సంధిస్తే.. మీకేమైనా పిచ్చా? అనేస్తారు వెంటనే. ఇదే ప్రశ్నను పదకొండేళ్ల క్రితం అంటే 2009లో ప్రశ్రిస్తే.. అప్పట్లో కూడా నీకేమైనా పిచ్చా? ఇలాంటివి సాధ్యమవుతాయా? అనే మాట వినిపించేది.ఇప్పుడు.. అప్పుడూ వచ్చే స్పందన ఒకటే. కాకుంటే.. మధ్యలో మాత్రం అసాధ్యమనుకున్నది సాధ్యమైంది. ఎందుకలా అంటే.. పక్కా ప్లానింగ్.. పట్టుదల.. అదే పనిగా ప్రయత్నం చేయటంగా చెప్పాలి.

ప్రపంచమంతా కరోనాతో ఆగమాగమైపోతున్న వేళ.. కరోనా పాజిటివ్ కేసులు 60వేలు వచ్చినా డీల్ చేసే సత్తా మనకుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల్ని జాగ్రత్తగా వింటే.. ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు ఉత్తినే రావట్లేదని.. పక్కా ప్లానింగ్ తోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పాలి.

అమెరికాతో పోల్చినప్పుడు తెలంగాణలో పది శాతం కంటే తక్కువే వసతులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే.. దేశంలోనూ అలాంటి పరిస్థితే. కాకుంటే.. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి? సమస్య పరిష్కారానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? అన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తే.. ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అలాంటి తెలివితేటల్ని ప్రదర్శించనున్నారు కేసీఆర్.

కరోనా తీవ్రతను ఎవరూ ఊహించలేనిది. అంచనాలకు భిన్నంగా ఉండే దీని ముప్పును ఎక్కువగా వేసుకొని ప్రయత్నాలు మొదలు పెడితే.. పరిస్థితి కంట్రోల్ లో ఉండటమే కాదు.. తక్కువ అపాయంతో బయటపడే వీలుందని చెప్పాలి. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు వెల్లువెత్తితే.. అందుకు అనుగుణంగా చికిత్స చేసేందుకు వీలుగా 1400 క్రిటికల్ కేర్ బెడ్లను సిద్ధం చేసి ఉంచారు. అంతేకాదు.. వైద్య సాయం చేసేందుకు 11 వేల మంది సైన్యాన్ని రెఢీగా ఉంచారు.

గచ్చిబౌలిలోని స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో వీటిని పూర్తి చేస్తారని చెబుతన్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని రానున్న రోజుల్లో వినియోగించేలా ప్లాన్ రెఢీ చేశారు. అంతేకాదు.. భారీ ఎత్తున ఐసోలేషన్ వార్డుల్ని సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా 12,400 బెడ్లు.. పూర్తిస్థాయి వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు.. రిటైర్ అయిన వైద్యులు.. ల్యాబ్ టెక్నిషియన్లు.. ఎంబీబీఎస్ పాస్ అయిన వారు.. పీజీ చేస్తున్న వారు.. ఇలా వేలాది మందిని సిద్ధం చేస్తున్నారు. మరీ.. అవసరమైతే.. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్ని.. కరోనా వార్డులుగా మార్చేలా ప్లానింగ్ లో ఉన్నారు. ఇలా.. భారీ ఎత్తున ప్లానింగ్.. అందుకు తగ్గ లాజిస్టిక్స్ ను సిద్ధం చేయటంతో పాటు.. అత్యవసర వేళ.. అవసరమయ్యే మందులు.. ఆహారాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు. ఇలా.. ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా కరోనా వార్ ప్లాన్ ను రెఢీ చేశారు కేసీఆర్. అందుకే.. ఆయనంత ధీమాగా అరవై వేల కేసులు వచ్చినా చికిత్స అందిస్తామని చెబుతున్నారు.