వైఎస్ పథకంపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రశంసలు

Sun Jan 20 2019 20:04:34 GMT+0530 (IST)

KCR Praises YSR In Telangana Assembly

విభేధించడం అయినా..అభినందించడం అయినా నిర్మొహమాటంగా చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తనదైన శైలిలో రాజకీయాలకు అతీతంగా పథకాలను ప్రశంసించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం విపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ...కేసీఆర్ కిట్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా ఏమాత్రం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కేసీఆర్ కిట్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్  స్పష్టం చేశారు. చాలా మంచి ఉద్దేశంతో ఎవరూ అడగకుండానే కంటివెలుగు కార్యక్రమం ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ అన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని సునేత్ర పేరుతో ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. త్వరలో చెవి ముక్కు గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాన్ని కేసీఆర్ ప్రశంసించారు. వైఎస్ హయాంలో తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం చాలా మంచి పథకమని కేసీఆర్ కొనియాడారు. ``ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీనే బాగా ఉంది. అందుకే ఆయుష్మాన్ భారత్ లో చేరమని ప్రధానికి చెప్పాం.`` అని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వాల హక్కు తప్ప దయాక్షిణ్యం కాదని కేసీఆర్ అన్నారు. ఆర్థిక ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 గా ఉంది. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే నంబర్ 1గా ఉన్నామన్నారు.  ఏది ఏమైనాసరే ఇచ్చిన వాగ్దానాలు వందకు వందశాతం గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించిన అనుసరించిన అవలంభించిన అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారని . అనంతరం మాత్రమే ప్రజలు తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారని కేసీఆర్ అన్నారు. ఇంత విశ్వాస్వాన్ని తమ మీద ఉంచినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గవర్నర్ ప్రసంగం పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగం లాగా ఉందని కొంతమంది అన్నారు. వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమి లేదన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినరో ఆ పార్టీ మేనిఫెస్టో అదే పాలసీ గవర్నర్ ప్రసంగంలో ఉంటదని సీఎం పేర్కొన్నారు.