Begin typing your search above and press return to search.

కేసీఆర్ మరో భారీ ప్లాన్.. చినజీయర్ వద్దకు పయనం

By:  Tupaki Desk   |   27 May 2020 2:00 PM GMT
కేసీఆర్ మరో భారీ ప్లాన్.. చినజీయర్ వద్దకు పయనం
X
ఈ ప్రపంచంలో నాలాగా యాగాలు, యజ్ఞాలు చేసేవాడున్నాడా అని తెలంగాణ సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో కాస్త గట్టిగానే చెప్పుకొచ్చాడు. కేసీఆర్ లో మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువ. ఆయన దేవుడిని కొలుస్తారు. యజ్ఞాలు, యాగాలు చేస్తుంటారు. నాడు రాజులు - చక్రవర్తులు చేసిన యాగాలు కూడా ఆ మధ్య చేశాడు.

తాజాగా కేసీఆర్ మరో భారీ క్రతువుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. శంషాబాద్ లోని ముచ్చింతల్ లో ఉన్న చినజీయర్ తో భేటి కానున్నారు. మే 29న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి చిన్నజీయర్ ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.

మే 29న ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ లోకి నీటిని విడుదల చేస్తారు. అంతకంటే ముందు ఉదయం 4 గంటలకు కొండపోచమ్మ దేవాలయంలో చినజీయర్ ఆధ్వర్యంలో చండీయాగం, సుదర్శన యాగం నిర్వహిస్తారు.

సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో కొండ పోచమ్మ సాగర్ నియోజకవర్గం ఉంది. ఈ ప్రాజెక్టును 1600 కోట్ల వ్యయంతో 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అతి తక్కువ సమయంలో కేవలం 3ఏళ్లలోనే పూర్తి చేశారు. ఈ కొండపోచమ్మ సాగర్ ద్వారా ఉమ్మడి మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ నీటి అవసరాలు కూడా తీరనున్నాయి.

ఈ ప్రాజెక్టుకు 30 కి.మీల దూరంలో ప్రఖ్యాత కొండ పోచమ్మ దేవాలయం ఉంది. ఆ ఆలయం పేరునే కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు పెట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా సిద్దిపేట జిల్లాలోని 1721 చెరువులకు నీటి విడుదల చేస్తారు. ప్రారంభోత్సవం రోజున 1500మంది ప్రజలు, నేతలకు భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు చేశారు. యాగ స్థలాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.