తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన అదుర్స్.. స్వయంగా పాల్గొన్న కేసీఆర్

Tue Aug 16 2022 14:00:01 GMT+0530 (IST)

KCR Participated in Mass National Anthem in Telangana

దేశభక్తి జాతీయ వాదం ఇప్పుడు దేశంలో ఎవర్ గ్రీన్ ఓట్లు రాల్చే సెంటిమెంట్ అస్త్రం. బీజేపీ దీన్ని సాంతం వాడుకొని లబ్ధి పొందుతోంది. బీజేపీ నేతలు మోడీ షాలు దీన్ని ఆయుధంగా చేసుకొని దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చారు. వాళ్లేనే వాడుకునేది మేం వాడుకోకూడదా? అని కేసీఆర్ సైతం రూటు మార్చాడు. సహజంగా ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండే కేసీఆర్.. తన సహజశైలికి భిన్నంగా పాల్గొనడం విశేషంగా మారింది.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా రెడ్ సిగ్నల్ పడింది. అందరూ ఉన్న చోట ఒక నిమిషం పాటు జాతీయ గీతాలాపన చేశారు.టీఆర్ఎస్ ప్రభుత్వం కోరికమేరకు ప్రజలు విద్యార్థులు పోలీసులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది.

ఇక మెట్రో సర్వీసులు కూడా ఒక నిమిషం పాటు ఆపి మరీ జాతీయ గీతాలాపన నిర్వహించడం విశేషం. ఎక్కడికక్కడ ప్రయాణికులు జాతీయ గీతాలాపన చేశారు. రాష్ట్రంలోని అన్ని కూడళ్లు ప్రభుత్వ కార్యాలయాలు పంచాయతీలు అంగన్ వాడీ కేంద్రాలు విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.

సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్స్ ఇచ్చి మరీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు మిగతా అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం వాహనదారులు ఎదుర్కొన్నారు. కానీ జాతీయ భావం దృష్ట్యా దీన్ని విజయవంతం చేశారు.

జాతీయవాదాన్ని అస్త్రంగా చేసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టున్నారు. ఇది బలమైన ముద్రగా ప్రజల్లో ఉంది. అందుకే తన సహజశైలికి భిన్నంగా బయటకు వచ్చి మరీ ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ ఆశ్చర్యపరిచారు. ఈ గీతాలాపన తెలంగాణలో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తెలంగాణ అంతా నిమిషం పాటు మారుమోగింది.