అబ్బాయి వల్ల కావట్లేదా? మేనల్లుడ్ని రంగంలోకి దించాల్సిందేనా?

Wed Oct 09 2019 15:00:01 GMT+0530 (IST)

KCR Only Option Is Harish Rao over Huzur Nagar Bypolls

చేతిలో అధికారం ఉంది. ఉప ఎన్నికల్ని ఎలా డీల్ చేయాలన్న అనుభవం ఉంది. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండ వారికి ఉంది. అలాంటి వేళ.. ఉప ఎన్నిక ఏదైనా.. తుది పలితం టీఆర్ ఎస్ కు అనుకూలంగా ఉంటుందనుకోవటంలో తప్పు లేదు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటం.. బలమైన సామాజిక వర్గానికి చెందినోడు.. ప్రత్యర్థులు అంత బలంగా లేకపోవటం లాంటి అంశాల్నిచూసినప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపు ఖాయమని ఎవరైనా చెబుతారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే.. ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న అంశానికి సంబంధించి పక్కా ప్లాన్ ను గులాబీ బాస్ సిద్ధం చేశారని చెబుతారు. దీనికి తగ్గట్లే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

గెలుపు ధీమా పెరిగిపోయి.. మెజార్టీ ఎంతన్న దానిపైనే గులాబీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఇంతటి సానుకూలత ఉన్న చోటకు తన రాజకీయ వారసుడు కేటీఆర్ ను పంపితే.. హుజూర్ నగర్ క్రెడిట్ ఆయన ఖాతాలో పడుతుందన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. దీంతో.. కేటీఆర్ ను హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి పంపారు. ఇటీవల నిర్వహించిన రోడ్ షోలో దాదాపు వెయ్యికార్లతో కేటీఆర్ అండ్ కో చేసిన హడావుడి అంతా ఇంతా కాదంటున్నారు.

ఈ హడావుడి ఇప్పుడు తలనొప్పిగా మారింది. మరోవైపు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా హుజూర్ నగర్ వాసులకు రుచించటం లేదని చెబుతున్నారు. కేటీఆర్ మాటల్లో వినయం కంటే అహంకారం ఎక్కువగా వినిపిస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. దీంతో.. కేటీఆర్ తో ప్రచారం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్నది తాజా సమాచారం. దీనికి తోడు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అనూహ్య పరిణామాలకు దారి తీయటం.. సంస్థకు చెందిన 48 వేల మంది ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ నోటి నుంచి రావటం ప్రజలకు షాకింగ్ గా మారింది. ఇలాంటివేళలో.. మంత్రి కేటీఆర్ తో ప్రచారం చేయించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. టాస్క్ మాస్టర్ హరీశ్ ను రంగంలోకి దించాలని చెబుతున్నారు.

హుజూర్ నగర్ లో నేతల మధ్య దూరాన్ని తగ్గించే విషయం అబ్బాయి వల్ల కావట్లేదని.. హరీశ్ అయితే మంచిదన్న మాట వినిపిస్తోంది. మరి.. అబ్బాయి వల్ల అవ్వని హుజూర్ నగర్ వ్యవహారాన్ని మేనల్లుడికి కేసీఆర్ అప్పగిస్తారా? అన్నది క్వశ్చన్. గతంలోనూ పలుమార్లు ట్రబుల్ షూటర్ గా హరీశ్ కు అప్పగించిన ప్రతి టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేశారని.. అందుకే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఆయనకు అప్పగిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.