కేసీఆర్.. విల 'నిజం' ఎంత?

Sun Dec 08 2019 11:03:47 GMT+0530 (IST)

KCR On About To Deal RTC Strike and Disha Murder Case

ఒక సమస్యను ప్రజల్లో నానేలా చేస్తారు.. ఏదో చేయబోతున్నామనే లీకులు ఇస్తారు.. చిట్టచివరకు తూచ్.. మేం అలా ఎందుకు చేస్తాం అంటూ అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపును ఇస్తారు. తెలంగాణ సీఎంగా గద్దెనెక్కిన కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు ప్రతీసారి ప్రతిపక్షాలు బలైపోతూనే ఉన్నాయి. రాల్లేసిన వారితో పూలు చల్లించుకొని చప్పట్లు కొట్టించుకుంటున్న ఘనత కేసీఆర్ సొంతం.. కేసీఆర్ మొదట విలన్ గా మారుతారు.. అనంతరం క్లైమాక్స్ లో హీరో అయిపోతారు.. కేసీఆర్ లోని ఆ విల‘నిజం’పై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది..కేసీఆర్ స్ట్రాటజీ ప్రత్యర్థులకు కూడా అంతుబట్టని విధంగా ఉంటుంది. మొన్నటి ఆర్టీసీ సమ్మె విషయంలో మొదట కార్మికులకు అండగా నిలిచి హల్ చల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. అస్సలు వారి సమ్మెకు మద్దతుగా ఆందోళనలు చేయలేదు. రేవంత్ రెడ్డి - ఉత్తమ్ రెడ్డి లాంటి వాళ్లు కూడా దగ్గరకు రాలేదు. అసలు ఆర్టీసీ సమ్మె వెనుకాల కేసీఆర్ ఉన్నారని.. ఆయన అభీష్టం మేరకే ఈ సమ్మె జరుగుతోందని వారు అనుమానించారు. అందుకే ఈ ఆటలో అరటిపండు కాకూడదని ప్రధాన ప్రతిపక్షమే దూరం జరిగిందట.. చివరకు ఆర్టీసీ సమ్మె విషయంలో మొదట విలన్ అయిన కేసీఆర్ తర్వాత వరాలు ప్రకటించి హీరో అయిపోయారు. ఈ ఆర్టీసీ ఉదంతంలో అటు కార్మిక సంఘాలను నియంత్రించి.. ప్రతిపక్షం కాంగ్రెస్ చెవిలో కేసీఆర్ పిచ్చి పువ్వులు పెట్టేశారు.

ఇక దిశ ఎన్ కౌంటర్ విషయంలోనూ కేసీఆర్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యింది. దిశ కుటుంబాన్ని కూడా పరామర్శించని కేసీఆర్ తీరుపై జాతీయ మీడియాలోనూ దుమ్మెత్తి పోశారు. తెలంగాణ పోలీసుల తీరు - కేసీఆర్ ను తిట్టిపోశారు. కానీ ఒక్క ఎన్ కౌంటర్ తో ఇప్పుడు దిశ కుటుంబమే కాదు.. మొత్తం మీడియా - యావత్ దేశం మనసులు గెలుచుకున్నారు కేసీఆర్..

ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నట్టు కేసీఆర్ ఏదైనా ఒక సమస్యపై మౌనంగా ఉన్నారంటే అందులో ఇన్వాల్వ్ కావడం లేదంటే దాని వెనుక పెద్ద  ఉపద్రవమే ఉండబోతోంది అని చెప్పకన చెప్పారు. దిశ ఎన్ కౌంటర్ - ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ మౌనం దాల్చి చివరకు నాన్చి భావోద్వేగాలన్నీ పతాక స్థాయికి చేరాక వాటికి ఇచ్చిన ఫినిషింగ్ టచ్ కు ఎవ్వరి నోటా మాట రాని పరిస్థితి. అందుకే ఇప్పుడు కేసీఆర్ మొదట విలన్ గా మారిపోతారు.. చివర్లో హీరో అయిపోతుంటారని.. ఆయన రాజకీయ ఉచ్చులో పాపం ప్రతిపక్షాలు - మిగతా పక్షాలు బలైపోతున్నాయని విశ్లేషిస్తున్నారు.