Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ది దూకుడా? నిరంకుశ‌మా? ఆప్తుల‌కే అందుబాటులో లేర‌ట‌..!

By:  Tupaki Desk   |   16 Oct 2019 1:21 PM GMT
కేసీఆర్‌ ది దూకుడా? నిరంకుశ‌మా? ఆప్తుల‌కే అందుబాటులో లేర‌ట‌..!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖ‌రి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? సామాన్యుల దేవుడిగా పూజ‌లందుకున్న ఆయ‌న నేడు అదే ప్ర‌జ‌ల‌తో తిట్టిపోయించుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నాయి తాజా ప‌రిణామాలు. ``నేనే మోనార్క్‌!``-నేను సీత‌య్యను- అనే త‌ర‌హాలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు సామాన్యుల నుంచి మేధావుల వ‌ర‌కు ఏవ‌గించుకునే స్థాయికి చేరిపోయింది. ఒక‌ప్పుడు పిలిస్తే ప‌లికిన ఆయ‌న రెండో సారి అధికారంలోకి వ‌చ్చే స‌రికి మాత్రం త‌ల‌బిరుసు వ్య‌వ‌హారాలు చేస్తున్నార‌నే పేరు తెచ్చుకున్నారు. త‌న‌కు న‌చ్చిన వారిని అంద‌లం ఎక్కించుకోవ‌డం, న‌చ్చనివారిని ఛీ కొట్ట‌డం రాజ‌కీయాల్లో నేత‌ల‌కు మామూలే అయినా.. ఉద్య‌మ ప‌థం నుంచి వ‌చ్చిన కేసీఆర్ కూడా సామాన్య నాయ‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని సాధార‌ణ ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోతున్నారు.

గ‌డిచిన 12 రోజులుగా తెలంగాణ‌లో ఆర్టీ సీ కార్మికులు క‌దం తొక్కుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో త‌మ‌కు ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. అదే స‌మ‌యంలో ఉద్య‌మ ప్ర‌భావంతో ఇద్ద‌రు కార్మికులు ఆత్మార్ప‌ణ చేసుకున్నారు. అయినా కూడా క‌ర‌గ‌ని కేసీఆర్ మ‌న‌సు.. నిర్బంధాన్ని మ‌రింత పెంచేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. చ‌ర్చ‌ల‌కు స‌సేమిరా అన‌డంతోపాటు.. దాదాపు 50 వేల మంది కార్మికుల‌ను రాత్రికి రాత్రి ఉద్యోగాల నుంచి ఊడ‌బెరుకుతున్నామ‌ని ఆదేశాలు జారీ చేశారు. దీనిని క‌వ‌ర్ చేసుకునేందుకు వారంత‌ట వారే ఉద్యోగాలు వ‌దులుకున్నార‌ని, దీనికి మేమేం చేస్తం! అంటూ ముక్తాయించారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రు కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మ‌హ‌త్య‌ల‌కు ఒడిగ‌ట్టారు.

ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన కేసీఆర్‌ కు ఆప్తుడు - ఆయ‌న స్వ‌యంగా అన్న అని ఆప్యాయంగా పిలుచుకునే కేకే ఉర‌ఫ్ కే. కేశ‌వ‌రావు రంగంలోకి దిగారు. ప్ర‌భుత్వం ఊ! అంటే తాను మ‌ధ్య‌వ‌ర్తిగా ఉండి చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తాన‌న్నారు. దీనికి కార్మిక సంఘాలు కూడా జై కొట్టాయి. స‌మాజం కూడా స్వాగ‌తించింది. సీనియ‌ర్ అయిన కేకే వ‌ల్ల స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. మ‌రి ఈ స‌మ‌యంలో దిగివ‌చ్చి.. కేకేను మ‌ధ్య‌వ‌ర్తిగా పెట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సిన కేసీఆర్‌.. ఏకంగా కేకే కే షాక్ ఇచ్చారు. ఆయ‌న‌కు కూడా అప్పాయింట్‌ మెంట్ ఇచ్చేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. దీనినే ఉటంకిస్తూ.. కేకే తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు.- అని కేకే వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అంద‌రినీ దూరం చేసుకుని ప‌ద‌వి అనుభ‌వించాల‌ని అనుకుంటున్న‌కేసీఆర్‌.. కు ఐదేళ్ల త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ప‌రిణామం క‌ళ్ల ముందు క‌నిపిస్తే.. ఏం చేస్తార‌నే ప్ర‌శ్న ఈ సంద‌ర్భంలో ఉద‌యించ‌క మాన‌దు. త‌న మానాన త‌ను నిరంకుశ‌త్వంగా వ్య‌వ‌హ‌రిస్తూ పోతే.. న్యాయ వ్య‌వ‌స్థ‌తో ప్ర‌జ‌ల నుంచి కూడా ఛీత్కారాలు ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప్ర‌జాస్వామ్య వాదులు. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో ? చూడాలి.