కేసీఆర్ కరుణించవా.. ఇట్లు కనుమరుగైన నేతలు

Sat Nov 09 2019 02:00:01 GMT+0530 (IST)

KCR Not Caring those Losers in Elections

బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టే నేతలు.. అధికారం ఉన్నన్నీ నాళ్లే ఆ హోదా పలుకుబడి.. ఓడిపోయామా ఇక అంతే సంగతులు.. కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోతే ఆమె పరిస్థితే ఘోరంగా తయారైంది. ఇక మిగతా వాళ్లను పట్టించుకునే చాన్స్ గులాబీ పార్టీలో ఉందా? అనే చర్చ సాగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా కీలక హోదాల్లో వెలుగు వెలిగిన గులాబీ నేతలు ఈ దఫా కనుమరుగైపోయారు. కొందరు ఓడిపోయి పదవులకు దూరమైపోగా.. మరికొందరు కేసీఆర్ కరుణ లేక ఆగమైపోతున్నారు.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో దఫా అధికారంలోకి వచ్చాక స్పష్టమైన మార్పును చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లా మంత్రిగా పోయిన మంత్రివర్గంలో వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు డమ్మీ అయిపోయారు. మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన ఆయనకు కనీసం  ఎమ్మెల్సీ లేదా సలహాదారు ఓ కార్పొరేషన్ పదవి అయినా దక్కుతుందని ఆశిస్తే అతీగతీ లేకుండా పోయిందట.. ఇక మాజీ మంత్రులు జూపల్లి కృష్ణరావు చందూలాల్ మహేందర్ రెడ్డిలు ఓడిపోయి అధికారం పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీరిని పట్టించుకునే నాథుడే టీఆర్ఎస్ లో కరువయ్యాడంటే అతిశయోక్తి కాదు.. ఇక 2014 టీఆర్ఎస్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం హోంమంత్రులుగా చేసిన కడియం నాయిని గురించి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. వీరికి ఎమ్మెల్యే టికెట్లు కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయారు. వీరిద్దరిని పూర్తిగా పక్కనపెట్టేశారు.

ఇక ఏదో పదవి వస్తుందని ఆశించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ స్పీకర్ మధుసూదనాచారి స్వామి గౌడ్ లాంటి నేతలు ఇప్పుడు కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారు.

వీరంతా వెలుగు వెలిగిన గులాబీ నేతలే. కానీ కేసీఆర్ కరుణా కటాక్షం లేక.. ఆయనను పదవి ఇవ్వమని అడగలేక కక్కలేక మింగలేక మౌనంగా ఉండిపోతున్నారట.. టీఆర్ఎస్ లోని సదురు నేతల బాధ ఇప్పుడు వర్ణనాతీతం అని చర్చించుకుంటున్నారు.