ఈటలకు అన్ని వైపులా బంధనాలు?

Mon May 10 2021 06:00:02 GMT+0530 (IST)

KCR Moves Pawns Quickly To Checkmate Etela On Home Turf

ఈటల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ అధిష్టానం అనుకున్నట్టుగా జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత.. మాజీ మంత్రికి సానుభూతి పెరుగుతోందని కూడా అంటున్నారు. అంతేకాకుండా.. పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన్ను కలిసి వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన కొత్త పార్టీ పెడతారని కూడా ప్రచారం సాగుతోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలతో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇప్పటి వరకూ ఈటల తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ.. ఆయన వేస్తున్న అడుగులు మాత్రం కొత్త పార్టీవైపే అని అంటున్నారు.

దీంతో.. టీఆర్ఎస్ కూడా ఆయనకు బంధనాలు వేసేందుకు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈటల రాజకీయంగా ప్రత్యర్థిగా నిలబడే ఛాన్స్ ఇవ్వొద్దని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. అటు టీఆర్ఎస్ కూడా బహిష్కరించ లేదు. మంత్రి వర్గం నుంచి మాత్రమే కేసీఆర్ తప్పించారు.

మంత్రి పదవి విషయంలో నేరుగా యాక్షన్ తీసుకున్న కేసీఆర్.. పార్టీలోంచి పంపే విషయంలో పరోక్షంగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ బాధ్యతలను కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు అప్పగించినట్టు సమాచారం. అంతేకాకుండా.. ఈటలకు పరిచయాలు ఉన్న అధికారులను కూడా బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులు ఈటల వెంట వెళ్లకుండా మంత్రులు రంగంలోకి దిగినట్టు సమాచారం. మొత్తంగా ఈటలకు అన్ని వైపుల నుంచి బంధనాలు వేసే ప్రయత్నం జరుగుతోందని టాక్. మరి అవి ఎంత వరకు ఈటలను అడ్డుకుంటాయన్నది చూడాలి.